Covid Alert: 46 జిల్లాల్లో 10శాతం పాజిటివిటీ రేటు..!

కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10శాతం మించిన జిల్లాల్లో ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated : 31 Jul 2021 19:46 IST

10 రాష్ట్రాల అధికారులతో కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష

దిల్లీ: గతకొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పది రాష్ట్రాల్లో వైరస్‌ తీవ్రత పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్యశాఖ, పది రాష్ట్రాల అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10శాతం మించిన జిల్లాల్లో ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించింది. వీటితోపాటు కొవిడ్‌ టెస్టులు, వ్యాక్సిన్‌ పంపిణీ పెంచాలని అన్ని రాష్ట్రాలకూ స్పష్టం చేసింది.

46 జిల్లాల్లో పెరుగుతోన్న పాజిటివిటీ రేటు..

కరోనా వైరస్‌ తీవ్రత పెరుగుతోన్న కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, అస్సాం, మిజోరాం, మేఘాలయా, ఆంధ్రప్రదేశ్‌, మణిపూర్‌ రాష్ట్రాల అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దాదాపు దేశవ్యాప్తంగా దాదాపు 46 జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. 53 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతం మధ్యలో ఉందని పేర్కొన్నారు. ఈ జిల్లాల్లో నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితులు మరింత క్షీణించే ప్రమాదముందని హెచ్చరించారు. అయితే, 80శాతం బాధితులు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నందున వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్రాలకు స్పష్టంగా సూచించారు.

టెస్టులు, వ్యాక్సిన్‌ వేగం పెంచాలి..

వైరస్‌ తీవ్రత పెరుగుతోన్న రాష్ట్రాల్లో కొవిడ్‌ కట్టడి చర్యలు, టెస్టులు ముమ్మరం చేస్తూనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. 60ఏళ్ల వయసుపైబడిన వారితో పాటు 45-60ఏళ్ల వారికి కొవిడ్‌ మరణం ముప్పు  ఎక్కువగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తోన్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలని రాష్ట్రాలకు తెలిపింది. ఈ నేపథ్యంలో రెండో డోసు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఇదే సమయంలో ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రైవేటు ఆస్పత్రులను ప్రోత్సహించాలని తెలిపింది. కొత్త వేరియంట్‌లను గుర్తించేందుకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నమూనాలకు INSACOG సహాయంతో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

దేశంలో కొన్ని చోట్ల వైరస్‌ ఉద్ధృతి తగ్గినట్లు కనిపించినప్పటికీ మరో ముప్పు మాత్రం ముంచుకొస్తూనే ఉంది. నిత్యం నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగం కేసులు కేవలం రెండు, మూడు రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. ఇదే సమయంలో దాదాపు పది రాష్ట్రాల్లో మళ్లీ వైరస్‌ ఉద్ధృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి ఇంకా కొనసాగుతూనే ఉందని.. రాబోయే రోజుల్లో మూడో ముప్పు తప్పదని కేంద్ర ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts