US: ఉగ్రవాదంతో జాగ్రత్త.. భారత్​కు వెళ్లే ప్రయాణికులకు అమెరికా కీలక సూచనలు

భారత్​కు వెళ్లే అమెరికా పౌరులకు బైడెన్​ ప్రభుత్వం పలు హెచ్చరికలను జారీచేసింది. వీటిలో ఉగ్రవాదంతోపాటు కొవిడ్ నిబంధనలు సహా ఇతర అంశాలను జోడించింది......

Updated : 16 Nov 2021 18:16 IST

వాషింగ్టన్‌: భారత్​కు వెళ్లే అమెరికా పౌరులకు బైడెన్​ ప్రభుత్వం పలు హెచ్చరికలను జారీచేసింది. వీటిలో ఉగ్రవాదంతోపాటు కొవిడ్ నిబంధనలు సహా ఇతర అంశాలను జోడించింది. నేరాలు, ఉగ్రవాదం, కరోనా వంటి అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు పాకిస్థాన్​కు వెళ్లాలనుకునేవారు తమ ప్రయాణాలపై పునరాలోచించుకోవాలని కోరింది.

భారత్‌లో ఉగ్రవాదం, మతపరమైన హింస వంటివాటి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని భారత్‌కు వెళ్లే తమ పౌరులకు అమెరికా సూచించింది. ఉగ్రవాదం, పౌర అసమ్మతి ఎక్కువగా ఉన్న కారణంగా జమ్ముకశ్మీర్‌కు వెళ్లొద్దని.. అలాగే యుద్ధవాతావరణానికి అవకాశం ఉన్నందున భారత్-పాక్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధి లోపు ప్రయాణించవద్దని తమ పౌరులకు సలహా ఇచ్చింది. ‘భారత్‌లో అత్యంత వేగంగా పెరుగుతున్న నేరాల్లో అత్యాచారాలు ఒకటని నివేదికలు చెబుతున్నాయి. పర్యాటక, ఇతర ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, హింసాత్మక ఘటనలు జరిగిన ఉదంతాలున్నాయి’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది.

లెవల్‌ వన్‌ నిబంధనల జారీ

మరోవైపు.. అమెరికా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) తమ పౌరులకు కొవిడ్ నిబంధనలను సైతం సూచించింది. టీకా పూర్తి డోసులు తీసుకున్నవారికి వైరస్ సంక్రమించే ప్రమాదం, తీవ్రమైన లక్షణాలు అభివృద్ధి చెందే అవకాశం తక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఈ మేరకు ‘లెవల్ వన్’ కరోనా నిబంధనలు జారీ చేసింది.

పాక్​ ప్రయాణాలపై పునరాలోచించండి

ఉగ్రవాదం, కిడ్నాప్‌ల వంటి ఘటనలు అధికంగా నమోదవుతున్న కారణంగా పాకిస్థాన్​లోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంక్వా రాష్ట్రాలతో పాటు.. ఫెడరల్లీ అడ్మినిస్ట్రేడ్ ట్రైబల్ ఏరియాస్ (ఎఫ్‌ఏటీఏ)కి అమెరికా పౌరులు వెళ్లొద్దని సూచించింది. ‘పాకిస్థాన్‌లో పెద్ద ఎత్తున దాడులకు ఉగ్రవాద గ్రూపులు కుట్ర పన్నుతున్నాయి. సైద్ధాంతిక ఆకాంక్షలతో పౌరులు, పోలీసులపై విచక్షణారహితంగా దాడులు జరిపిన ఘటనలున్నాయి. రవాణా కేంద్రాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాలు, పర్యాటక ప్రదేశాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనా స్థలాలే లక్ష్యంగా ఎలాంటి హెచ్చరిక లేకుండా దాడి జరిగే అవకాశం ఉంది’ అని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాదులు గతంలోనూ అమెరికా దౌత్యవేత్తలతో పాటు.. దౌత్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని అమెరికా అధికారులు గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని