Donald Trump: అదే నేనుంటేనా..

అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కారణమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు.

Published : 17 Aug 2021 01:41 IST

జో బైడెన్‌ రాజీనామా చేయాలన్న మాజీ అధ్యక్షుడు

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కారణమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులను కల్పించినందుకు తలవంపుతో అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందని జో బైడెన్‌పై విరుచుకుపడ్డారు. గడిచిన రెండు దశాబ్దాలుగా అమెరికా, నాటో బలగాల సంరక్షణలో ఉన్న అఫ్గానిస్థాన్‌ను తాజాగా తాలిబన్లు హస్తగతం చేసుకోవడం.. ఈ సమయంలో బైడెన్‌ వ్యవహరించిన తీరును డొనాల్డ్‌ ట్రంప్‌ తప్పుబట్టారు.

‘అఫ్గానిస్థాన్‌లో తాజాగా నెలకొన్న పరిస్థితులకు కారణమైనందుకు అవమానంగా జో బైడెన్‌ రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైంది’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా అఫ్గాన్‌ విషయంలో జో బైడెన్‌ గొప్ప పని చేశారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరిన ఆయన.. అమెరికా చరిత్రలో జరిగిన ఫెయిల్యూర్స్‌ ఇది ఒకటిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. వీటితో పాటు దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య మరోసారి పెరగడం, ఇమ్మిగ్రేషన్‌ విధానం, ఆర్థిక, ఇంధన విధానాలపై జో బైడెన్‌ అనుసరిస్తున్న తీరును డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా విమర్శించారు.

ట్రంప్‌ హయాంలోనే ‘నిరంతర యుద్ధాలకు స్వస్తి..’

నిరంతర యుద్ధాలకు స్వస్తి పలకాలని మెజారిటీ అమెరికా ప్రజలు భావిస్తున్నారని అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. తాలిబన్లపై చేస్తున్న యుద్ధంపై ఖర్చు తలకు మించిన భారం కావడంతో అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగే ప్రక్రియకు ఆయన హయాంలోనే (2020 ఫిబ్రవరిలో) ఒప్పందం కుదిరింది. ఇక బైడెన్‌ అధికారం చేపట్టిన తర్వాత.. ఆగస్టు 31నాటికే అఫ్గాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ పూర్తి కావాలని జో బైడెన్‌ ఆదేశించారు. అంతకుముందు తాలిబన్లతో జరిగిన శాంతి ఒప్పందం ప్రకారం.. అఫ్గాన్‌ ప్రజాస్వామ్య ప్రభుత్వంతో తాలిబన్లు అధికారం పంచుకోవాలనే షరతు విధించింది. కానీ, బైడెన్‌ అలాంటి షరతులను పట్టించుకోలేదు. నిర్ణీత సమయం కంటే ముందే అమెరికా సైన్యం నిష్క్రమణ ప్రక్రియ ముగిసింది. ఈ వ్యవహారంలో బైడెన్‌ చర్యలను తప్పుబడుతోన్న డొనాల్డ్‌ ట్రంప్‌.. తాను అధికారంలో ఉంటే ఈ ప్రక్రియ మరింత శాంతియుతంగా జరిగేదని అభిప్రాయపడ్డారు.

వైట్‌హౌస్‌ ముందు నిరసన..

ఇదిలాఉంటే, అఫ్గాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రక్రియలో జో బైడెన్‌ సరిగా వ్యవహరించడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అఫ్గాన్‌ ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని వచ్చిన వార్తలను జో బైడెన్‌ గతంలో తోసిపుచ్చారు. అనంతరం నెల తిరగకముందే అక్కడి నుంచి అమెరికా రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయడానికి ప్రస్తుతం అమెరికా నానా కష్టాలు పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాలోని అఫ్గాన్‌ పౌరులు కూడా వైట్‌హౌస్‌ ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అఫ్గాన్‌లో తాజాగా నెలకొన్న పరిస్థితులకు జో బైడెన్‌ బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని