
Donald Trump: అమెరికా రక్షణ సామగ్రితో.. చైనా, రష్యా ‘రివర్స్ ఇంజినీరింగ్’!
అనుమానాలు వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: అఫ్గానిస్థాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవడంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరిగా వ్యవహరించలేదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శించారు. ముఖ్యంగా అఫ్గాన్‌లో వదిలేసి వచ్చిన రక్షణ సామగ్రిని చైనా, రష్యా దేశాలు ఉపయోగించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా వేల కోట్ల విలువైన ఆయుధాలు, పరికరాలపై చైనా, రష్యా దేశాలు ‘రివర్స్ ఇంజినీరింగ్’కు పాల్పడే ప్రమాదం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడి తాజా చర్యలు ఇందుకు దారులు తెరచినట్లేనని డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
‘అమెరికా బలగాలను ఉపసంహరించుకోవడంలో అధ్యక్షుడు జో బైడెన్ అసమర్థంగా వ్యవహరించారు. తద్వారా అమెరికా ప్రమాదంలో పడడమే కాకుండా శత్రు దేశాలకు ప్రయోజనం చేకూరేలా ఉంది. ముఖ్యంగా అక్కడ వదిలేసిన రక్షణ పరికరాలపై ఇప్పటికే చైనా, రష్యాలు రివర్స్ ఇంజినీరింగ్ మొదలు పెట్టి ఉండవచ్చని కచ్చితంగా చెప్పగలను. ముఖ్యంగా ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యంత ప్రత్యేకమైనవిగా భావించే అపాచీ హెలికాప్టర్లను వారు తీసుకెళ్లి ఉండవచ్చు. వాటి విడిభాగాలను వేరు చేసి.. అదేవిధమైన సాంకేతికతతో కొత్తగా తయారు చేసుకునే అవకాశం ఉంది. అలా చేయడంలో వారు దిట్ట. ఇది చాలా అవమానకరం, సిగ్గుపడాల్సిన విషయం’ అని ఓ వార్తా ఛానల్‌కు ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అఫ్గాన్ పౌరులను ఇతర దేశాలకు తరలించామని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ వారిలో ఉగ్రవాదులూ ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటివన్నీ అసమర్థ, తొందరపాటు చర్యలేనని విమర్శించారు.
ఇక 2001 నుంచి అమెరికా దాదాపు 80బిలియన్ డాలర్లు విలువైన రక్షణ సామగ్రిని అఫ్గాన్‌కు తరలించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో 73 విమానాలు కూడా ఉన్నాయి. అందులో అపాచీ హెలికాప్టర్లతో పాటు పలు కీలకమైన రక్షణ పరికరాలను కూడా అమెరికా అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. అయితే వాటిని ఉపయోగించే వీలు లేకుండా నిర్వీర్యం చేసినట్లు అమెరికా సైన్యం ఇదివరకే వెల్లడించింది. మరికొన్నింటిని మాత్రం అఫ్గాన్ పైలట్లు విదేశాలకు తరలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వాటిపై చైనా, రష్యా దేశాలు రివర్స్ ఇంజినీరింగ్‌కు పాల్పడే ప్రమాదముందని మాజీ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.