Molnupiravir: కొవిడ్‌ ఔషధం.. భారత్‌లో ధర ఎంతంటే..!

వారంలోనే మార్కెట్‌లోకి రానున్న ఈ మోల్నుపిరవిర్‌.. ఒక్కో మాత్ర ధర రూ.35 ఉండనుందని వెల్లడించింది.

Published : 04 Jan 2022 21:08 IST

స్పష్టతనిచ్చిన డాక్టర్‌ రెడ్డీస్‌

దిల్లీ: కొవిడ్‌ చికిత్సలో భాగంగా మెర్క్‌ తయారు చేసిన మోల్నుపిరవిర్‌ ఔషధం ఆశాజనక ఫలితాలను ఇస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఔషధం అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ యాంటీవైరల్‌ ఔషధం జనరిక్‌ మాత్ర ధర ఎంత ఉండనుందనే విషయంపై డాక్టర్‌ రెడ్డీస్‌ స్పష్టతనిచ్చింది. మరో వారంలోనే మార్కెట్‌లోకి రానున్న ఈ మోల్నుపిరవిర్‌.. ఒక్కో మాత్ర ధర రూ.35 ఉండనుందని వెల్లడించింది.

‘కొవిడ్‌ నిర్ధారణ అయిన తర్వాత లక్షణాలు ఉన్నవారు వైద్యుల సిఫార్సు మేరకు ఐదురోజుల పాటు ఈ ఔషధాన్ని తీసుకోవాలి. మొల్‌ఫ్లూ (Molflu) పేరుతో లభ్యమయ్యే ఈ ఔషధాన్ని ఐదు రోజుల్లో మొత్తం 40 మాత్రలు వాడాల్సి ఉంటుంది. దీంతో ఈ కోర్సుకు కావాల్సిన మాత్రలకు మొత్తంగా రూ.1400 ఖర్చు అవుతుంది. అదే అమెరికాలో మాత్రం ఇందుకు 700 డాలర్లు ఖర్చు కానుంది. ఈ మొల్‌ఫ్లూ ఔషధం భారత్‌లో వచ్చే వారం నుంచి లభ్యం కానుంది’ అని డాక్టర్‌ రెడ్డీస్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ముఖ్యంగా కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వీటిని త్వరలో అందుబాటులో ఉంచుతామన్నారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు మెర్క్‌ సంస్థ రూపొందించిన మోల్నుపిరవిర్‌ ఔషధం ఆశాజనక ఫలితాలు ఇస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా వైరస్‌ ఆర్‌ఎన్‌ఏను లక్ష్యంగా చేసుకొని పనిచేసే ఈ ఔషధం కొవిడ్‌ బాధితుల్లో వైరల్‌ లోడ్‌ గణనీయంగా తగ్గిస్తుందని తేలింది. దీంతో బాధితులు తొందరగా కోలుకొనే అవకాశం ఉందని ఔషధ తయారీ సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో ఔషధ తయారీకి కేంద్రంగా ఉన్న భారత్‌లో వీటిని భారీగా ఉత్పత్తి చేసేందుకు పలు సంస్థలతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. డాక్టర్‌ రెడ్డీస్‌తో పాటు ఇతర సంస్థలు తయారుచేసే మొల్నుపిరవిర్‌ ఔషధాన్ని ఇక్కడ నుంచి దాదాపు 100కుపైగా అల్ప, మధ్య ఆదాయ దేశాలకు ఎగుమతి చేయనున్నారు. మన దేశంలో ఈ ఔషధాన్ని 13 కంపెనీలు ఉత్పత్తి చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవలే వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని