
New Zealand PM: భూకంపం వచ్చినా.. బెదరని ప్రధాని
వెల్లింగ్టన్: భూమి కంపిస్తుంటే... ఏమీ జరగనట్లు నిబ్బరంగా ఉండటం అంత సులభమా? ఏమో న్యూజిలాండ్ ప్రధానిని చూస్తే సులభమేమో అనిపిస్తోంది. గత శుక్రవారం న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్లో భూకంపం సంభవించింది. అదే సమయంలో ప్రధాని జెసిండా ఆర్డెర్న్ ఓ మీడియా కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో కొవిడ్ పరిస్థితి గురించి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అప్పుడు భూమి కంపించిన కారణంగా ప్రధాని ఉన్న భవనం కుదుపులకు లోనైనా.. ఆమె ఏమాత్రం బెదరలేదు. పైగా ఆ కొద్దిసేపు పోడియం పట్టుకొని తర్వాత చిరునవ్వులు చిందించారామె. ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భూమి కంపించడం ఆగాక... ‘క్షమించండి. కొంచెం అంతరాయం కలిగింది. మరోసారి ఆ ప్రశ్న అడుగుతారా?’ అంటూ జెసిండా ఆ కార్యక్రమాన్ని కొనసాగించి, అక్కడున్న వారిని ఆశ్చర్యపర్చారు. గత శుక్రవారం వెల్లింగ్టన్ ఆ పరిసర ప్రాంతాల్లో భూకంప తీవ్రత 5.9 గా నమోదైంది. దీని వల్ల ఎటువంటి నష్టం సంభవించిన దాఖలాలు లేవు. ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్‌లో స్వల్ప, మధ్యస్థ భూకంపాలు తరచూ సంభవిస్తూనే ఉంటాయి. అగ్ని పర్వత విస్ఫోటనాలూ చోటుచేసుకుంటాయి. 2011లో క్రైస్ట్ చర్చ్ నగరంలో సంభవించిన భూకంపం కారణంగా 185 మంది ప్రాణాలు కోల్పోయారు.