
Omicron variant: కొత్త వేరియంట్‌పై ఆందోళన.. వారిపై నిఘా పెంచండి!
రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు
దిల్లీ: దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్‌తో ఆందోళన చెందుతోన్న ప్రపంచ దేశాలు.. మరోసారి అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే విదేశీయుల రాకపై ఇజ్రాయెల్ నిషేధం విధించగా.. మరికొన్ని దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలకు సిద్ధమవుతున్నాయి. ఇలా కొత్త వేరియంట్‌పై ఆందోళనలు మొదలైన నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. ఆందోళనకర వేరియంట్ వెలుగు చూసిన దేశాలను ‘ప్రమాదం’ కేటగిరి జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం.. ఆయా దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులపై అదనపు పర్యవేక్షణ ఉంచాలని పేర్కొంది. వీటితో పాటు కొవిడ్ కట్టడి చర్యలు, టెస్టింగ్, ట్రాకింగ్, వ్యాక్సినేషన్ కవరేజ్‌ను మరింత పెంచాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. స్థానికంగా కొవిడ్ హాట్‌స్పాట్‌ల పర్యవేక్షణతో పాటు పాజిటివ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు తక్షణమే పంపించాలని స్పష్టం చేసింది. వీటికి సంబంధించి అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మరోసారి లేఖ రాశారు.
* ఆందోళనకర వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన దేశాలను ఇప్పటికే ప్రమాదం పొంచి ఉన్న కేటగిరిలో చేర్చాం. అటువంటి దేశాల నుంచి భారత్ వచ్చే ప్రయాణికులపై అదనపు పర్యవేక్షణ ఉంచాలి
* ఈ ఆందోళనకర వేరియంట్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కఠినమైన కట్టడి, క్రియాశీల నిఘా, వ్యాక్సినేషన్‌ను పెంచడం, కొవిడ్ నిబంధనలను అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయడం అత్యవసరం
* అంతర్జాతీయ విమానాల్లో భారత్ వచ్చే ప్రయాణికుల గత ప్రయాణ వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేకమైన ‘రిపోర్టింగ్ మెకానిజం’ ఉంది. దీనిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా స్థాయిలో సమీక్షించుకోవాలి
* ఈ కొత్త వేరియంట్ వల్ల వైరస్ విస్తృత పెరిగినట్లయితే.. దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన టెస్టింగ్ పరికరాలను సంసిద్ధం చేసుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ టెస్టులు తగ్గినట్లు మా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా ఆర్‌టీపీసీఆర్ టెస్టుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు సరైన సంఖ్యలో లేకుంటే మహమ్మారి వాస్తవిక వ్యాప్తిని అంచనా వేయడం అత్యంత క్లిష్టమవుతుంది
* కొవిడ్ హాట్‌స్పాట్‌లు లేదా ఈమధ్య కొవిడ్ తీవ్రత పెరుగుతోన్న ప్రాంతాలపై పర్యవేక్షణ కొనసాగించాలి. ఆశించిన స్థాయిలో టెస్టింగ్‌లను చేయడంతో పాటు పాజిటివ్ వచ్చిన నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం తక్షణమే సమీప ల్యాబ్‌కు పంపించాలి
* కొవిడ్ పాజిటివిటి రేటు 5శాతం కంటే దిగువనే ఉండే విధంగా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలి. ఇందుకోసం కొవిడ్ టెస్టులను గణనీయంగా పెంచడం, ఆర్‌టీపీసీఆర్‌ల సంఖ్యను పెంచుకోవాలి
* బాధితులకు మెరుగైన చికిత్సలో ఆలస్యం కలగకుండా అవసరమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలను రాష్ట్రాలు అందుబాటులో ఉంచుకోవాలి. ఇందుకు అనుగుణంగానే కేంద్ర ఇచ్చే నిధులను రాష్ట్రాలను సద్వినియోగం చేసుకోవాలి
* దేశంలో కొత్త వేరియంట్‌ల ఉనికిపై ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇన్సాకోగ్ (INSACOG) ఏర్పాటు అయ్యింది. సాధారణ పౌరుల నుంచి తీసుకునే నమూనాలను ఇన్సాకోగ్‌కు వెంటవెంటనే పంపించాలి
* సెకండ్ వేవ్ సమయంలో కొవిడ్‌పై దేశవ్యాప్తంగా అసత్య వార్తల ప్రభావం అధికంగా కనిపించింది. ఈ నేపథ్యంలో అటువంటి అపోహలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అనుమానాలు నివృత్తి చేస్తూ ప్రజలకు అవగాహన కలిగించాలి
* ఇదిలాఉంటే, దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్తరకం వేరియంట్ కేసులు ఇప్పటికే బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోత్సువానా, ఇజ్రాయెల్, హాంకాంగ్ దేశాలకు వ్యాపించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.