Afghan Defence Minister: గ్వాంటనామో బే మాజీ ఖైదీ అఫ్గాన్‌ రక్షణ మంత్రి..!

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకొని దాదాపు పది రోజులు దాటడంతో కీలక పదవులకు నియామకాలు చేపట్టారు. అధ్యక్ష పదవి రేసులో ముల్లాబరాదర్‌ పేరు ముందుంది. ఇక నిన్న రక్షణ, ఆర్థిక శాఖలకు మంత్రుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.

Updated : 26 Aug 2021 15:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకొని దాదాపు పది రోజులు దాటడంతో కీలక పదవులకు నియామకాలు చేపట్టారు. అధ్యక్ష పదవి రేసులో ముల్లాబరాదర్‌ పేరు ముందుంది. ఇక నిన్న రక్షణ, ఆర్థిక శాఖలకు మంత్రుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. అధికారికంగా ప్రకటించకపోయినా.. ఈ రెండు పదవులను నమ్మకస్తులైన తాలిబన్‌ నేతలకే కట్టబెట్టారు. 

రక్షణ మంత్రిగా ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం జకీర్‌ పేరు బయటకు రాగా.. ఆర్థిక మంత్రిగా గుల్‌ అఘా పేరు ప్రచారంలోకి వచ్చింది. వీరిలో జకీర్‌ గతంలో అమెరికాకు చెందిన గ్వాంటనామో బే జైలుల్లో కొన్నేళ్లు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన జైలుగా దీనిని అభివర్ణిస్తారు. 2001లో అమెరికా దళాలు అఫ్గాన్‌లో ప్రవేశించగానే ముల్లా అబ్దుల్‌ ఖయ్యూం జకీర్‌ లొంగిపోయారు. ఆ తర్వాత దాదాపు ఏడేళ్లపాటు గ్వాంటనామోలో ఉన్నారు. తర్వాత అఫ్గాన్‌లోని పౌల్‌ ఇ చర్ఖీ జైలుకు తరలించారు. కొన్ని జాతుల నాయకుల ఒత్తిళ్ల కారణంగా 2008లో ఆయన్ను అఫ్గాన్‌ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిర్ణయంపై బ్రిటన్‌లోని ప్రజాప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  అనంతరం జకీర్‌ తిరిగి తాలిబన్లలో కలిసిపోయారు. ఆయన హెల్మాండ్‌,నిమ్రూజ్‌ ప్రావిన్స్‌ల్లో తాలిబన్‌ దళానికి నాయకత్వం వహించారు. క్రమంగా తాలిబన్‌ నేతగా ఎదిగారు. 
ఆర్థిక మంత్రిగా ఎంపికైనట్లు భావిస్తున్న గుల్‌ అఘా అంతర్జాతీయ ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. తాలిబన్‌ ప్రతినిధిగా జుబైహుల్లా ముజాహిద్‌ కొనసాగుతున్నారు. అష్రఫ్‌ ఘనీ సర్కారులోని ప్రభుత్వ ప్రతినిధి హత్య తర్వాత నుంచి ఆ బాధ్యతలు మొత్తం ముజాహిద్‌ చూస్తున్నారు. అఫ్గాన్‌ కేంద్ర బ్యాంక్‌ అధిపతిగా హాజీ మహమ్మద్‌ ఇద్రిస్‌ను తాలిబన్‌ నియమించింది. గతంలో కూడా ఆర్థిక విషయాలపై పనిచేసిన అనుభవం ఇద్రిస్‌కు ఉంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని