Farm laws: సాగు చట్టాలు మంచివే.. కానీ విఫలమయ్యాం: వ్యవసాయ శాఖ మంత్రి

సాగు చట్టాలతో ప్రయోజనాలే ఎక్కువని, వాటిని రైతుల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్ అభిప్రాయపడ్డారు......

Published : 19 Nov 2021 19:51 IST

దిల్లీ: సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్​ స్వాగతించారు. అయితే చట్టాలతో ప్రయోజనాలే ఎక్కువని, వాటిని రైతుల్లోకి తీసుకెళ్లడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. వాటి వల్ల కలిగే ప్రయోజనాలను కొన్ని రైతు సంఘాలకు అర్థమయ్యే విధంగా చెప్పడంలో విఫలయ్యామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తూనే ఉంటుందని, ఇలా చట్టాలను వెనక్కి తీసుకోవడం బాధ కలిగించిందన్నారు.

రైతుల సమస్యలు తొలగించేందుకే ఈ చట్టాలను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తోమర్‌ పునరుద్ఘాటించారు. వీటితో అన్నదాతలకు మంచి జరిగేదని.. వారి జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ కృషి చేశారన్నారు. ‘ఈ చట్టాలతో కలిగే లాభాలను కొన్ని రైతు సంఘాలకు అర్థమయ్యే విధంగా చెప్పలేకపోయాం. చాలా బాధగా ఉంది. వ్యవసాయ రంగంలో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ నిత్యం శ్రమిస్తారు. కానీ కొందరికి ఈ చట్టాల్లో లోపాలు కనిపించాయి. వారితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించాం. కానీ ఫలితం దక్కలేదు’ అని తోమర్ పేర్కొన్నారు. 2014 నుంచి రైతుల కోసం చేపట్టిన పథకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు​.

చాలా మంది రైతులు మద్దతిచ్చారు: యోగి

సాగు చట్టాల రద్దుపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సైతం తోమర్‌ తరహాలోనే స్పందించారు. ‘వాస్తవానికి రైతుల్లో చాలా మంది ఈ చట్టాలకు మద్దతిచ్చారు. వీటితో వ్యవసాయ రంగంలో విప్లవం సృష్టించవచ్చని విశ్వసించారు. కొందరికి మాత్రమే ఈ చట్టాలు నచ్చలేదు. ఆ రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది. కానీ ప్రజలకు మేము ఏం చెబుదామని అనుకున్నామో, అందులో విజయం సాధించలేకపోయాము. ప్రధాని మోదీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఇదొక చారిత్రక నిర్ణయం’ ఉత్తర్​ప్రదేశ్​ సీఎం పేర్కొన్నారు.

మోదీపై షా ప్రశంసలు

సాగు చట్టాలను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘గురునానక్​ జయంతి రోజు మోదీ ఈ ప్రకటన చేయడం ఎంతో ప్రత్యేకం. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని, ఇతర ఆలోచనలు లేవని ఇది నిరూపిస్తోంది. మోదీ తన అనుభవం, నాయకత్వ లక్షణాలను మరోసారి చూపించారు. మోదీ చెప్పినట్టే.. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిత్యం కృషిచేస్తుంది’ అని అమిత్​ షా ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని