
Fake Patients: కొవిడ్ సెంటర్లలో నకిలీ రోగులు.. రూ. 10వేలకు ఆశచూపి..
ఔరంగాబాద్: కరోనా వైరస్ సోకింది ఒకరికి.. చికిత్స పొందుతున్నవారు మరొకరు.. రూ. 10వేలు ఆశచూపి నకిలీ రోగులను పెట్టి అసలువారు చికిత్స పొందకుండా పరారయ్యారు. మూడు రోజులు గడిచిన తర్వాత కానీ అక్కడి డాక్టర్లకు ఈ విషయం తెలియలేదు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సిద్ధార్థ్, ఉద్యానాథ్ అనే ఇద్దరు యువకులకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారు శుక్రవారం.. మెల్ట్రాన్ కొవిడ్ సెంటర్‌ను ఆశ్రయించారు. అయితే వీరిలో ఎలాంటి లక్షణాలు లేకపోయినప్పటికీ ప్రాథమిక చికిత్స అందించాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు యువకులకు స్పష్టం చేశారు. ఇందుకోసం ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందని చెప్పగా అందుకు వారు అంగీకరించారు. కానీ ఆ యువకులు వారి స్థానంలో మరో ఇద్దరు యువకులను ఆసుపత్రిలో చేర్పించి పరారయ్యారు. ఈ విషయం తెలియని వైద్యులు నకిలీ రోగులకు చికిత్సను ప్రారంభించారు. అయితే వారు ఎలాంటి మందులు తీసుకోలేదు. ఆదివారం ఆసుపత్రి హెడ్‌ను కలిసి తమను వీలైనంత త్వరగా డిశ్చార్జ్ చేయాలని విజ్ఞప్తి చేయగా.. అందుకు ఆమె నిరాకరించారు.
ఆరుగురిపై ఫిర్యాదు
మరుసటిరోజు కూడా వారు ఇదే వైఖరి ప్రదర్శించడంతో అనుమానం వ్యక్తం చేసిన వైద్యులు.. యువకులను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తాము అసలు రోగులం కాదని.. రూ.10వేలు ఇస్తామంటే కరోనా రోగులుగా ఆసుపత్రిలో చేరామని చెప్పుకొచ్చారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిద్ధార్థ్, ఉద్యానాథ్ సహా.. వారి స్థానంలో ఆసుపత్రిలో చేరిన ఇద్దరు, వీరికి సహకరించిన మరో ఇద్దరి పేర్లను ఫిర్యాదులో పేర్కొంది.