
Facebook: ఫేస్బుక్లో అఖిలేష్‌పై అనుచిత వ్యాఖ్యలు.. మార్క్ జూకర్‌బర్గ్‌పై ఫిర్యాదు
పేజీ నిర్వాహకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన యూపీ పోలీసులు
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ను విమర్శిస్తూ ఫేస్బుక్లో కొందరు అభ్యంతరకర పోస్టులు చేశారని.. అందుకు మెటా (గతంలో ఫేస్బుక్) సంస్థ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా జూకర్‌బర్గ్‌తో పాటు మరో 49 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చేలా పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఫేస్బుక్ సీఈఓ నేరుగా ఎటువంటి పోస్టులు చేయనప్పటికీ.. అఖిలేష్ పరువుకు భంగం కలిగించేలా ఫేస్బుక్ ప్లాట్‌ఫాంను వినియోగించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అయితే, కోర్టు ఆదేశాల మేరకు తొలుత జూకర్‌బర్గ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ.. దర్యాప్తు అనంతరం ఎఫ్ఐఆర్ నుంచి ఆయన పేరును పోలీసులు తొలగించారు.
అఖిలేష్ యాదవ్‌ను అవమానపరుస్తూ ఫేస్బుక్లో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ యూపీలోని కన్నౌజ్ జిల్లాకు చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి స్థానిక జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసుల నుంచి స్పందన లేకపోవడంతో అమిత్ కుమార్.. సీఆర్పీసీ 156 (3) కింద అక్కడి జిల్లా కోర్టును ఆశ్రయించారు. అఖిలేష్ పరువుకు భంగం కలిగించేలా కొందరు ఫేస్బుక్లో వ్యాఖ్యలు చేసినందున.. ఆ సంస్థ సీఈఓ జూకర్‌బర్గ్‌తో పాటు మరో 49 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో సదరు ఫేస్బుక్ పేజీ నిర్వాహకుడికి ప్రతివాదిగా చేర్చాలని కోరారు.
ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని ఫిర్యాదుదారుడికి సూచించింది. అనంతరం ఆయన వాటిని కోర్టుకు అందించారు. ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం.. సమాజ్‌వాదీ పార్టీ నేతలపై అనుచిత పదజాలం ప్రయోగించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆ వ్యాఖ్యలు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు జూకర్‌బర్గ్‌తోపాటు పలువురిపై తొలుత కేసు నమోదు చేశారు. అయితే, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఈ కేసులో ఫేస్బుక్ సీఈఓ పేరును తొలగించినట్లు వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యలకు వేదికైన సదరు ఫేస్బుక్ పేజీ నిర్వాహకుడిపై మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.