
Corona in China: చైనాలో కరోనా.. పలు నగరాల్లో పాఠశాలలు, విమానాలు బంద్!
స్థానికంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేస్తోన్న అధికారులు
బీజింగ్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి పుట్టినిల్లు చైనాలో వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. పలు నగరాలు, పట్టణాల్లో స్థానికంగా వ్యాపిస్తోంది. ఒక్క కేసు నమోదైనా ఉలిక్కిపడుతోన్న చైనా.. తాజాగా పలు నగరాల్లో వైరస్ విజృంభణ మొదలు కావడంతో అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా పాఠశాలలు మూసివేయడం, వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడంతో పాటు భారీ స్థాయిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడం ప్రారంభించింది.
తాజాగా షాంఘై నుంచి షియాన్, గున్సూ, ఇన్నర్ మంగోలియా ప్రావిన్సుల్లో ఓ వృద్ధ జంట పర్యటించింది. వారిలో కొవిడ్ లక్షణాలు కనిపించడంతో అధికారులు వారి కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేపట్టారు. అనంతరం వారితో సన్నిహితంగా మెలిగిన వారిని పరీక్షించగా డజన్ల కొద్దీ కేసులు కేసులు బయటపడుతున్నాయి. కేవలం గురువారం ఒక్కరోజే 13 పాజిటివ్ కేసులు బయటపడినట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఇలా స్థానికంగా ఒక్కసారిగా కొవిడ్ వ్యాప్తి మొదలు కావడంతో అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రావిన్సుల్లో భారీ స్థాయిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.
స్థానికంగా లాక్‌డౌన్ ఆంక్షలు..
కొవిడ్ తీవ్రత మొదలు కావడంతో ఆయా ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలు, పాఠశాలలు మూసివేశారు. వినోద వేడుకలపై నిషేధం విధించారు. కేసులు బయటపడిన ప్రాంతాల్లో స్థానికంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దాదాపు 40లక్షల జనాభా కలిగిన లాన్‌జువో ప్రావిన్సుతో పాటు సమీప ప్రాంతాల ప్రజలను అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశించారు. కేవలం కొవిడ్ నెగటివ్ రిపోర్టు ఉన్నవారినే మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో బయటకు అనుమతిస్తున్నారు. ఇన్నర్ మంగోలియాలోని పలు ప్రాంతాల్లోనూ నగరం నుంచి రాకపోకలను నిషేధించారు. వైరస్ తీవ్రత కొనసాగుతోన్న ప్రాంతాల్లో వందల సంఖ్యలో విమాన సేవలనూ చైనా అధికారులు రద్దు చేశారు. దీంతో షియాన్, లాన్‌జు మధ్య నడిచే విమానాల్లో 60శాతం రద్దు చేసినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, కరోనా వైరస్ పోరులో భాగంగా చాలా దేశాలు వ్యాక్సిన్‌ను విస్తృతంగా పంపిణీ చేయడంతో పాటు వైరస్‌తో కలిసి జీవించే వ్యూహాలను రచిస్తున్నాయి. కానీ, చైనా మాత్రం పాజిటివ్ కేసులను సున్నాకు తీసుకురావడంతోనే మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఇదే లక్ష్యంతో జీరో-కొవిడ్ (Zero Covid) వ్యూహాన్ని అనుసరిస్తోంది. దీంతో ఒక్క కేసు నమోదైనా ఆ ప్రాంత సరిహద్దులను మూసివేసి లక్షల సంఖ్యలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతోంది. మరోవైపు వ్యాక్సిన్ పంపిణీని శరవేగంగా కొనసాగుతున్న చైనా.. ఇప్పటివరకు 200కోట్లకుపైగా డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం.