Uttarakhand Rains: కొండచరియలు తెచ్చిన చిక్కు.. ఇంధనం లేక ఇక్కట్లు!

నాలుగురోజులుగా కురిసిన వర్షాలకు ఉత్తరాఖండ్ రాష్ట్రం అతలాకుతలమైంది. వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో రాణిఖేత్‌, ఆల్మోరాకు మైదాన ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. అవి వరుసగా రెండోరోజు ఇంధన కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 

Updated : 20 Oct 2021 13:02 IST

దేహ్రాదూన్‌: నాలుగురోజులుగా కురిసిన వర్షాలకు ఉత్తరాఖండ్ రాష్ట్రం అతలాకుతలమైంది. వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో రాణిఖేత్‌, ఆల్మోరాకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఆ ప్రాంతాలు వరుసగా రెండోరోజు ఇంధన కొరతను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

దేహ్రాదూన్‌కు 320 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాణిఖేత్‌ వద్ద చాలా తక్కువ మొత్తంలో ఇంధనం అందుబాటులో ఉంది. దాన్ని అత్యవసర సేవల కోసం అందుబాటులో ఉంచారు. 24 గంటల తర్వాత అక్కడ లోవోల్టేజ్ ఎలక్ట్రిసిటీని పునరుద్ధరించారు. టెలిఫోన్, ఇంటర్నెట్‌ సేవల అంతరాయం కొనసాగుతోంది. అల్మోరా పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. కొండచరియలు పడి, రహదారులు మూసుకుపోవడంతో ఈ రెండు ప్రాంతాలకు నైనీతాల్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 47 మంది మృతిచెందారని, ఒక్క కుమాఓన్ ప్రాంతంలోనే 42 మంది ప్రాణాలు కోల్పోయారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

ఇదిలా ఉండగా..ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి రూ.1.9లక్షల పరిహారం ఇవ్వనున్నారు. జీవనాధారం కోల్పోయిన రైతుల్ని ఆదుకోనున్నట్లు హామీ ఇచ్చారు. అలాగే పలు ప్రాంతాల్లో చిక్కుకున్న పర్యాటకుల్ని ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని