Afghanistan: అఫ్గాన్‌పై జీ-7 దేశాల ఉమ్మడి కార్యాచరణ

అఫ్గానిస్థాన్‌లో శరవేగంగా చోటుచేసుకొంటున్న పరిణామాలపై చర్చలు జరిపి..

Updated : 19 Aug 2021 09:46 IST

వచ్చే వారం వర్చువల్‌ భేటీకి బైడెన్, బోరిస్‌ నిర్ణయం

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌లో శరవేగంగా చోటుచేసుకొంటున్న పరిణామాలపై చర్చలు జరిపి.. ఓ ఉమ్మడి వ్యూహం, కార్యాచరణ రూపొందించేందుకు వచ్చే వారం జి-7 దేశాల వర్చువల్‌ సమావేశం నిర్వహించాలని ఈ బృందంలో సభ్య దేశాలైన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ ఓ అంగీకారానికి వచ్చారు. ఈ ఇద్దరు నేతలు ఫోను చర్చలు జరిపిన అనంతరం శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. అఫ్గాన్‌ నుంచి తమ పౌరులను, యుద్ధ ప్రయత్నంలో సహకరించిన అఫ్గాన్‌ జాతీయులను తరలించడంలో తమ సేనలు చూపిన తెగువ, చొరవలను నేతలిద్దరూ ప్రశంసించినట్లు తెలిపింది. ఇతర ప్రజాస్వామ్య దేశాలతో కలిసి అఫ్గాన్‌ పరిణామాలపై నిఘా కొనసాగించాలని, అక్కడున్న శరణార్థులు.. పౌరుల రక్షణకు మానవతాదృక్పథంతో ప్రపంచ సమాజం సాయం అందించాలని ఇరువురు నేతలు చర్చల ద్వారా ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటన పేర్కొంది. మరోవైపు.. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ కూడా కతార్, కువైట్‌ తదితర మిత్రదేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.

సర్కారు ఏర్పడిన తర్వాతే గుర్తిస్తాం: చైనా

అఫ్గాన్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తాలిబన్లకు దౌత్యపరమైన గుర్తింపు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చైనా తెలిపింది. అన్ని వర్గాల ప్రాతినిధ్యంతో స్వేచ్ఛాయుత, సంఘటిత ప్రభుత్వమే ఏర్పాటవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. తాలిబన్లు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని, ముఖ్యంగా వీగర్‌ మిలిటెంట్లకు అఫ్గాన్‌ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు  ఇచ్చిన మాటను తాలిబన్లు నిలబెట్టుకోవాలని హితవు పలికింది.

అఫ్గాన్‌ ప్రజలకు అండగా నిలవండి: ఇమ్రాన్‌

అఫ్గానిస్థాన్‌ సంక్షోభం శాంతియుతంగా ముగిసేలా ప్రపంచ సమాజం చేయూత ఇవ్వాలంటూ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అన్ని దేశాలను అభ్యర్థిస్తున్నారు. యుద్ధ వాతావరణం నడుమ నలిగిపోయి, ఆర్థికంగా కూడా చితికిపోయిన ప్రజలకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. ఈ మేరకు పాక్‌ ప్రధాని కార్యాలయం మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేస్తూ.. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ కూడా ఇమ్రాన్‌కు ఫోను చేసి అఫ్గాన్‌ గురించి మాట్లాడినట్లు తెలిపింది. డెన్మార్క్‌ ప్రధానమంత్రి మెటె ఫ్రెడెరిక్‌సేన్‌  కూడా ఇమ్రాన్‌తో మాట్లాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని