Ashraf Ghani: ఘనీ ఎంత డబ్బుతో పారిపోయారో తెలుసా..?

అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ కట్టల కొద్ది డబ్బుతో దేశాన్ని వీడారట. నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్‌లో పట్టేమొత్తాన్ని వెంట తీసుకెళ్లారని, మిగతాది వాటిలో కూర్చడం కుదరక అక్కడే వదలాల్సి వచ్చిందని ఓ అధికారి వెల్లడించారు. అఫ్గాన్‌లోని రష్యా దౌత్యకార్యాలయం సోమవారం ఈ విషయాన్ని వెల్లడించిందని ఓ వార్తా కథనం పేర్కొంది. 

Published : 17 Aug 2021 01:36 IST

వెల్లడించిన రష్యా దౌత్యకార్యాలయం

కాబుల్‌: అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ కట్టల కొద్ది డబ్బుతో దేశాన్ని వీడారట. నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్‌లో పట్టేమొత్తాన్ని వెంట తీసుకెళ్లారని, మిగతాది వాటిలో కూర్చడం కుదరక అక్కడే వదలాల్సి వచ్చిందని ఓ అధికారి వెల్లడించారు. అఫ్గాన్‌లోని రష్యా దౌత్యకార్యాలయం సోమవారం ఈ విషయాన్ని వెల్లడించిందని ఓ వార్తా కథనం పేర్కొంది. 

ఘనీ ప్రస్తుతం ఏ దేశానికి వెళ్లారన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు. మొదట తజికిస్థాన్‌కు వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి. ఆ దేశం అనుమతించకపోవడంతో ప్రస్తుతం ఒమన్ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లనున్నారని సమాచారం. ‘అష్రాఫ్ ఘనీ గురించి తెలిసిన విషయం ఏంటంటే.. ఆయన వెళ్లేప్పుడు వెంట పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్లారు. నాలుగు కార్లను డబ్బుతో నింపేశారు. మరికొంత మొత్తాన్ని హెలికాప్టర్‌లో సర్దారు. వాటిలో పట్టకపోవడంతో మరికొంత సొమ్మును అక్కడే వదిలేశారు’ అని నికితా ఇషెంకో వెల్లడించారు. నికిత కాబుల్‌లోని రష్యా దౌత్యకార్యాలయానికి చెందిన అధికార ప్రతినిధి. ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. అయితే ఆ వార్తలు మాత్రం ధ్రువీకరణ కాలేదు.

తాలిబాన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌లో పలు దేశాల దౌత్యకార్యాలయాలు ఖాళీ అయ్యాయి. రష్యా మాత్రం కొందరు అధికారుల్ని అక్కడే ఉంచింది. తాలిబాన్లనతో సంబంధాలకు మొగ్గు చూపుతున్న ఆ దేశం.. వారిని పాలకులుగా గుర్తించడానికి తొందరేమీ లేదని వ్యాఖ్యానించింది. వారి పాలనను కొంతకాలం గమనించనున్నట్లు చెప్పింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని