Farmers Ghar Wapsi: ముగిసిన పోరు.. 383 రోజుల తర్వాత రైతన్నల ఇంటిబాట!

రైతు ఉద్యమానికి సారథ్యం వహించిన రాకేశ్‌ టికాయిత్‌తోపాటు ఆయన మద్దతుదారులు 383 రోజుల తర్వాత తిరిగి వారి ఇంటి బాటపట్టారు.

Published : 15 Dec 2021 22:18 IST

ఘాజీపుర్‌ సరిహద్దులో అన్నదాతల సంబరాలు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళనలు సుదీర్ఘకాలం పాటు సాగిన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది కాలం పాటు సాగిన రైతన్నల నిరసనలతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఎట్టకేలకు వాటిని రద్దు చేసింది. దీంతో రైతు నేతలు వారి ఆందోళనలకు ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో రైతు ఉద్యమానికి సారథ్యం వహించిన రాకేశ్‌ టికాయిత్‌తో పాటు ఆయన మద్దతుదారులు 383 రోజుల తర్వాత తిరిగి ఇంటి బాటపట్టారు. ఈ సందర్భంగా దిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దులోని ఘాజీపుర్‌ వద్ద రైతన్నలకు భారీ వీడ్కోలు లభించింది. భారీ సంఖ్యలో మద్దతుదారులు అక్కడకు చేరుకొని రైతు నేతలకు వీడ్కోలు పలకడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.

సంవత్సరం పాటు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగించిన రైతులు, వారి కుటుంబీకులు తాజాగా ఇళ్లకు బయలుదేరారు. తాత్కాలిక వసతి కోసం తెచ్చుకున్న ఇంటి సామగ్రిని వారి ట్రాక్టర్లలో ఎక్కించిన రైతులు.. దేశభక్తి గీతాలు, పాటలు పాడుతూ కొద్దిసేపు నృత్యాలు చేశారు. ‘13నెలల పాటు వీధుల్లో చేసిన పోరాటం ముగించి ఈ రోజు తిరిగి ఇంటికి బయలుదేరాము. ఈ సందర్భంగా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపిన దేశ పౌరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ భారతీయ కిసాన్‌ యూనియన్‌ (BKU) నేత రాకేశ్‌ టికాయిత్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అనంతరం తన స్వగ్రామమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా, సిసౌలీకి ప్రయాణమయ్యారు. టికాయిత్‌తోపాటు ఆందోళనల్లో పాల్గొన్న మరికొందరు ముఖ్య రైతు నేతలు, వారి మద్దతుదారులు కార్లలో ర్యాలీగా బయలుదేరారు. ఆ సమయంలో మద్దతుదారుల నుంచి రైతన్నలకు విశేష స్పందన లభించింది. దారి పొడవునా వారి కాన్వాయ్‌కు పూలతో వీడ్కోలు చెప్పడం కనిపించింది.

ఇదిలాఉంటే, సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఉద్యమం ఎప్పుడు ముగుస్తుందంటూ రైతు నేతలను అడిగితే ‘సాగు చట్టాల బిల్లు వాపసీ ఎప్పుడు జరిగితే.. ఘర్‌ వాపసీ కూడా అప్పుడే జరుగుతుంది’ అంటూ చెప్పిన విషయం తెలిసిందే. వారు చెప్పినట్లుగానే సాగు చట్టాల బిల్లు రద్దుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన తర్వాతే అన్నదాతలు ఇంటిదారి పట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని