Omicron scare: మరో రాష్ట్రానికి ఒమిక్రాన్‌.. గోవాలో ఎనిమిదేళ్లబాలుడిలో గుర్తింపు

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మరో రాష్ట్రానికి వ్యాపించింది. గోవాలో ఎనిమిదేళ్ల పిల్లాడిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు.

Published : 27 Dec 2021 23:35 IST

దిల్లీలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

పనాజీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా మరో రాష్ట్రానికి వ్యాపించింది. గోవాలో ఎనిమిదేళ్ల పిల్లాడిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. ఆ బాలుడు డిసెంబర్ 17న యూకే నుంచి గోవా వచ్చాడని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె మీడియాకు వెల్లడించారు. అతడి నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌ వచ్చినట్లు చెప్పారు. తాము కేంద్రప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, అలాగే కొత్త సంవత్సర వేడుకల విషయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 600కి చేరువవుతున్నాయి. సుమారు 150 మంది కోలుకున్నారు. గోవాతో కలిపి 20 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాపించింది. 

అంతర్జాతీయ ప్రయాణికులకు ఏడు రోజుల హోం క్వారంటైన్‌..ఈ రోజు నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ముప్పు(రిస్క్‌) పొంచి ఉన్న దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు కూడా వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ప్రకటించింది. ప్రస్తుతం తమిళనాడులో 34 మంది ఒమిక్రాన్ బాధితులున్నారు. రిస్క్‌ జాబితాలో లేని దేశాల నుంచి వచ్చిన వారిలో కూడా ఈ వేరియంట్‌ను గుర్తించారు. దాంతో తమిళనాడు నిబంధనల్లో మార్పులు చేసి, హోం క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది. 

దిల్లీలో ఈ రోజు నుంచే రాత్రి కర్ఫ్యూ..దిల్లీ  ప్రభుత్వం ఈ రోజు నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయనుంది. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూను పాటించాల్సి ఉంది. దేశ రాజధానిలో కొవిడ్ పాజిటివిటీ రేటు 0.55 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఈ ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని