Google Doodle: ఈరోజు డూడుల్ ‘గ్రీన్ టీ’ ప్రేమికుల కోసమే..! 

పోషకాల టీ.. గ్రీన్ టీ. చర్మ రక్షణకూ, వృద్ధాప్య ఛాయలు రాకుండా, ఇప్పుడు మనల్ని వేధిస్తోన్న కరోనా పై కూడా అస్త్రంలా పనిచేస్తుందని పలువురు నిపుణులు ఈ టీ గురించి చెప్తుంటారు. 

Published : 17 Sep 2021 13:56 IST

టీ పోషకాలను చాటిన సుజిమురా జయంతి సందర్భంగా..

టోక్యో: పోషకాల టీ.. గ్రీన్ టీ. చర్మ రక్షణకూ, వృద్ధాప్య ఛాయలు రాకుండా, ఇప్పుడు మనల్ని వేధిస్తోన్న కరోనాపై కూడా అస్త్రంలా పనిచేస్తుందని పలువురు నిపుణులు ఈ టీ గురించి చెప్తుంటారు. అందుకే ఆరోగ్య స్పృహ ఉన్న ఎంతోమంది జీవితంలో ఇది భాగం అయ్యింది. అసలు ఈ గ్రీన్ టీపై పరిశోధనలు చేసి, దాని ప్రయోజనాలను ప్రపంచానికి చాటింది ఎవరో తెలుసా..?

ఆ వ్యక్తే జపాన్‌కు చెందిన మిషియో సుజిమురా. ఇప్పుడు ఆమె 133వ జయంతి సందర్భంగా గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‌ను విడుదల చేసింది. సుజిమురా ల్యాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నట్లుగా, పక్కనే టీ ఆకులు, గ్రీన్‌ టీ కప్పుతో ఆ డూడుల్‌ను రూపొందించింది. ఆమె పరిశోధనల కారణంగానే గ్రీన్‌ టీలోని పోషక పదార్థాల గురించి ప్రపంచానికి తెలిసిందని గూగుల్ డూడుల్ ట్విటర్ ఖాతా ప్రశంసించింది.

సుజిమురా 1888లో ఒకెగావాలో జన్మించారు. ఆమెకు మొదటి నుంచి సైన్స్ అంటే విపరీతమైన ఆసక్తి. మొదట్లో సైన్స్ ఉపాధ్యాయురాలిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆమె.. తర్వాత శాస్త్రవేత్త కావాలనే లక్ష్యం వైపు అడుగులు వేశారు. దానిలో భాగంగా టోక్యో ఇంపీరియల్ యూనివర్సిటీలో చేరి, గ్రీన్‌ టీపై పరిశోధన చేయడం ప్రారంభించారు. విటమిన్‌ బి1 ను కనిపెట్టిన డాక్టర్ ఉమెటారో సుజుకితో కలిసి శోధన సాగించారు.

‘గ్రీన్‌ టీలో గణనీయమైన మొత్తంలో విటమిన్‌ సి ఉందని మొదట వారి పరిశోధనలో తేలింది. అనంతరం టీకి చేదు రుచి తెస్తోన్న కారకాలను గుర్తించి వేరు చేశారు. మొదట కాటెచిన్, తర్వాత మరింత చేదుకు కారణమవుతోన్న టానిన్‌ను వేరు చేశారు. ఈ పరిశోధనలు ‘ఆన్ ది కెమికల్ కాంపోనెంట్స్ ఆఫ్ గ్రీన్‌ టీ’ థీసిస్‌కు పునాది వేశాయి. దాంతో ఆమె వ్యవసాయ రంగంలో డాక్టరేట్ పొందిన మొదటి మహిళగా నిలిచారు’ అంటూ గూగుల్ ఆమె గురించి రాసుకొచ్చింది. ఇంకా మరెన్నో ఘనతలు సాధించి, వివిధ హోదాల్లో సేవలు అందించిన సుజిమురా 1969లో మరణించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని