Farm Laws Repeal: సాగుచట్టాల రద్దు.. ప్రక్రియ ఎలా ఉంటుందంటే!

ఇప్పటికే చట్టరూపం దాల్చుకున్న వాటిని రద్దు చేయాలంటే రాజ్యాంగ పరంగా ఎటువంటి విధానాన్ని అనుసరిస్తారు..?

Published : 19 Nov 2021 18:10 IST

చట్టాల రద్దు ప్రక్రియపై న్యాయ నిపుణులు చెబుతున్నది ఇదే..

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అమలు చేయాలనుకున్న సాగు చట్టాలపై ఇప్పటికే సుప్రీం కోర్టు స్టే విధించింది. మరోవైపు ఈ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత రావడంతో వాటిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చట్టరూపం దాల్చుకున్న వాటిని రద్దు చేయాలంటే రాజ్యాంగ పరంగా ఎటువంటి విధానాన్ని అనుసరిస్తారు..? దీనిపై న్యాయనిపుణులు ఏమంటున్నారో చూద్దాం..

‘చట్టంగా మారిన దానిని రద్దు చేయాలంటే అవి రూపుదిద్దుకోవడానికి అవలంబించే పద్ధతినే అనుసరిస్తారు. చట్టాన్ని తేవాలన్నా.. దాన్ని రద్దు చేయాలన్నా కేవలం పార్లమెంటుకే ఆ అధికారం ఉంటుంది. సాధారణంగా ఏదైనా కొత్త చట్టాన్ని తెచ్చేందుకు పార్లమెంటులో ఏవిధంగానైతే బిల్లును ప్రవేశపెడుతారో.. చట్టం రద్దుకోసం అదే ప్రక్రియ ఉంటుంది. తాజాగా మూడు చట్టాలను రద్దు చేయడానికి ప్రభుత్వం ఓ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది’ అని న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా వెల్లడించారు. ఇది మినహా మరో మార్గం ఏమీ ఉండదని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌ పీడీటీ ఆచార్య పేర్కొన్నారు.

అంతేకాకుండా కేవలం ఒక్క బిల్లుతోనే మూడు చట్టాలను ప్రభుత్వం రద్దు చేయగలదని పీకే మల్హోత్రా స్పష్టం చేశారు. అయితే, ఈ మూడు చట్టాలను ఎందుకు రద్దు చేస్తున్నారో తెలియజేస్తూ ప్రభుత్వం ఆ బిల్లులో పలు కారణాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఇలా ఆ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపితే.. అది కూడా ఓ చట్టంగా మారుతుంది. ఇప్పటివరకు ఆ మూడు చట్టాలు అమలు కాకపోయినప్పటికీ.. వాటికి పార్లమెంటుతో పాటు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినందున వాటిని ఇప్పటికీ చట్టంగానే పరిగణిస్తారు. అందుకే వాటిని కేవలం పార్లమెంటు ద్వారా మాత్రమే రద్దు చేయగలమని రాజ్యాంగ నిపుణులు పీకే మల్హోత్రా స్పష్టం చేశారు. బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం పార్లమెంటులో వీటిపై చర్చ జరగడంతో పాటు ఓటింగ్‌ను కూడా నిర్వహిస్తారని తెలిపారు.

ఇదిలాఉంటే, గురునానక్‌ జయంతి సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని నరేంద్రమోదీ.. కేవలం రైతుల ప్రయోజనాలకే మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చామని గుర్తుచేశారు. వీటిపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నప్పటికీ ఈ విషయంలో రైతుల్లో ఓ వర్గాన్ని మాత్రం ఒప్పించలేకపోయామన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు మోదీ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియను వచ్చే శీతాకాల సమావేశాల్లోనే పూర్తి చేస్తామని ప్రధాని ప్రకటించారు. దీంతో ఈ నెల 29నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని