Updated : 15/08/2021 10:56 IST

75th Independence day: ప్రజాజీవనంలో ప్రభుత్వ అనవసర జోక్యం తగ్గాలి: మోదీ

దిల్లీ: వలస పాలన నుంచి విముక్తి పొంది 75వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు కరోనా నిబంధనలు పాటిస్తూనే.. ఈ అమృత ఘడియల్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు దేశ ప్రతిష్ఠకు ప్రతీకగా నిలుస్తున్న ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. జాతినుద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. శతాబ్ది ఉత్సవాల నాటికి సాధించాల్సిన లక్ష్యాలను ఆవిష్కరించారు. రానున్న 25 ఏళ్ల కాలాన్ని అమృత ఘడియలుగా పేర్కొన్న ఆయన అనేక కొత్త అంశాల్ని స్పృశిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగంలోని కొన్ని కీలకాంశాలు...

> అభివృద్ధిలో దేశంలో అన్ని ప్రాంతాలను కలుపుకొని పోవాలి. ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్‌-లద్దాఖ్‌లతో కూడిన హిమాలయ ప్రాంతం, తీర, గిరిజన ప్రాంతాల అభివృద్ధే భారతదేశ భవిష్యత్తుకు పునాదులు కానున్నాయి. 

> జమ్మూకశ్మీర్‌లోని అసెంబ్లీ స్థానాల పునర్విభజనకు కమిషన్‌ ఏర్పాటు చేశాం. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్నాం. 

> లద్దాఖ్‌లో అత్యాధునిక మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. మరోవైపు ఇండస్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ లద్దాఖ్‌ను ఉన్నత విద్యకు కేంద్రంగా మార్చనుంది.   

> భారత్‌కు ఉన్న శక్తిసామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రంగాల్లోనైతే వెనుబడి ఉన్నామో.. అక్కడ ప్రగతి సాధించేందుకు కృషి చేయాలి. మౌలిక వసతులతో పాటు దళితులకు, వెనుకబడిన తరగతులకు, గిరిజనులు, ఉన్నత వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటీవలే వైద్య విద్యలో ఓబీసీ కేటగిరీకి రిజర్వేషన్లు కల్పించాం. అలాగే రాష్ట్రాలు తమకు తాముగా ఓబీసీ జాబితాను సిద్ధం చేసుకునేందుకు అనుమతి ఇచ్చాం.

> గ్రామాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. గత ఐదేళ్లలో అనేక గ్రామాలకు రోడ్లు, విద్యుత్తు సదుపాయాలను విస్తరించాం. ఆప్టికల్‌ నెట్‌వర్క్‌ ద్వారా గ్రామాలను సమాచార సాంకేతికతతో సమృద్ధిపరుస్తున్నాం. గ్రామాల్లోనూ డిజిటల్‌ సేవల ఆధారంగా యువపారిశ్రామికవేత్తలు పుట్టుకొస్తున్నారు. 

> రానున్న కొన్నేళ్లలో సన్న, చిన్నకారు రైతుల సామూహిక సామర్థ్యాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉంది. వారికి కొత్త వసతులు కల్పించాలి. దేశ ప్రతిష్ఠకు వారు ప్రతీకగా మారాలి. 70కి పైగా మార్గాల్లో నేడు కిసాన్‌ రైళ్లు నడుస్తున్నాయి. 

> మౌలిక వసతుల నిర్మాణం కోసం త్వరలో రూ.100 లక్షల కోట్లతో ‘పీఎం గతి శక్తి ప్లాన్‌’ పథకాన్ని ప్రారంభించనున్నాం. ఆర్థిక వృద్ధే లక్ష్యంగా సమగ్ర మౌలిక వసతుల కల్పన చేపట్టనున్నాం.

> రానున్న 75 వారాల్లో దేశంలోని ప్రతి ప్రాంతాన్ని 75 వందే భారత్‌ రైళ్ల ద్వారా అనుసంధానించనున్నాం. 

> ప్రజల జీవనంలో ప్రభుత్వ అనవసర జోక్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశ సర్వతోముఖాభివృద్ధికి ఇది ఎంతో అవసరం. 

> భారీ సంస్కరణలకు కావాల్సిన రాజకీయ సంకల్పానికి ఇప్పుడు భారత్‌లో కొదవలేదని యావత్తు ప్రపంచం గుర్తించింది.

> శతాబ్ది ఉత్సవాల నాటికి ఇంధన రంగంలో స్వయంసమృద్ధి సాధించాల్సిన అవసరం ఉంది. రైల్వే మార్గాల్లో 100 శాతం విద్యుదీకరణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. వాతావరణ మార్పుల నేపథ్యంలో జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌ను ప్రకటిస్తున్నాం. హరిత హైడ్రోజన్‌ ఉత్పత్తికి భారత్‌ను కేంద్రబిందువుగా మార్చాల్సిన అవసరం ఉంది.  

> క్రీడారంగంలో మరింత ప్రతిభ, సాంకేతిక, ప్రొషెషనలిజంను తీసుకురావాల్సిన అవసరం ఉంది. క్రీడలపై తల్లిదండ్రుల దృష్టికోణం మారింది.   

> మెరుపు దాడులు, వైమానిక దాడులతో శత్రుదేశాలకు స్పష్టమైన హెచ్చరికలు పంపగలిగాం. భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకోవగలదని స్పష్టం చేశాం.       

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని