Coal Shortage: బొగ్గు కొరత.. 22 రోజులకు సరిపడా నిల్వలున్నాయ్‌..!

థర్మల్‌ విద్యుత్‌ తయారీ సంస్థల డిమాండుకు సరిపోయే బొగ్గును సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నామని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ పేర్కొంది.

Published : 12 Oct 2021 21:18 IST

డిమాండుకు తగిన బొగ్గును అందిస్తామన్న కేంద్ర బొగ్గు శాఖ

దిల్లీ: థర్మల్‌ విద్యుత్‌ తయారీ సంస్థల డిమాండుకు సరిపోయే బొగ్గును సరఫరా చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ పేర్కొంది. నిత్యం 2 మిలియన్‌ టన్నుల బొగ్గును సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం రోజువారి సరఫరా 1.95మిలియన్‌ టన్నులకు పెరిగిందని వెల్లడించింది. దేశంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ సంక్షోభం రాబోతుందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ ఈ ప్రకటన చేసింది.

‘డిమాండుకు సరిపడా బొగ్గును సరఫరా చేసేందుకు కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (CIL) నుంచి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. నిన్న ఒక్కరోజే 1.95MT బొగ్గును సరఫరా చేశాం. వాటిలో 1.6మిలియన్‌ టన్నులను CIL నుంచి, మిగతాది సింగరేణి నుంచి అందించాం’ అని బొగ్గు మంత్రిత్వశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు. అక్టోబర్‌ 20-21వ తేదీ నాటికే రోజువారీ బొగ్గు సరఫరా రెండు మిలియన్‌ టన్నులకు చేరుకుంటుందన్నారు. దేశ చరిత్రలోనే ఇంత మొత్తంలో బొగ్గు సరఫరా చేయడం ఇదే తొలిసారి అని భావిస్తున్నానని.. రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో సరఫరా కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు అవసరమైన బొగ్గును తమ శాఖ నుంచే అందిస్తామన్నారు.

22 రోజులకు సరిపడా నిల్వలున్నాయ్‌..

దేశవ్యాప్తంగా 22 రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలు ప్రస్తుతం కోల్‌ ఇండియా దగ్గర అందుబాటులో ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. రుతుపవనాల ప్రభావం తగ్గుతున్నందున రానున్న రోజుల్లో బొగ్గు లభ్యత మరింత పెరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా మరో 30 నుంచి 40ఏళ్ల పాటు బొగ్గుకు డోకా లేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని