Covid Deaths: కొవిడ్‌ మరణాలపై ఆ నివేదికలు అవాస్తవం.. ఖండించిన కేంద్రం

కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి సమయంలో భారత్‌లో భారీ సంఖ్యలో కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది.

Updated : 22 Jul 2021 22:04 IST

దిల్లీ: కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి సమయంలో భారత్‌లో భారీ సంఖ్యలో కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం మరోసారి ఖండించింది. ముఖ్యంగా కొవిడ్‌ మరణాల సంఖ్యను ప్రభుత్వం తక్కువగా చేసి చూపుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటిని తోసిపుచ్చిన భారత ప్రభుత్వం.. అవన్నీ కల్పిత, అవాస్తవ నివేదికలేనని స్పష్టం చేసింది. దేశంలో కొవిడ్‌ మరణాల నమోదుకు ప్రత్యేక వ్యవస్థ ఉందని.. వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చేపడుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ పునరుద్ఘాటించింది.

రాష్ట్రాలే నమోదు చేస్తాయి..

దేశంలో ప్రభుత్వం వెల్లడించిన కరోనా మరణాల సంఖ్య కంటే ఎక్కువగా (దాదాపు 10రెట్లు) మరణాలు చోటుచేసుకున్నాయని విదేశీ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో ఆక్సిజన్‌ లేమితో కొవిడ్‌ బాధితులు చనిపోలేదని కేంద్రం వెల్లడించడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. తాజా విమర్శలను ఖండించిన కేంద్ర ఆరోగ్యశాఖ.. కొవిడ్‌ మరణాలను రాష్ట్రాలే నమోదు చేస్తాయని స్పష్టం చేసింది. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వ్యక్తి మరణానికి వారి వయసు, ప్రాంతం, ఇతర ఆరోగ్య సమస్యలు ప్రభావం చూపుతాయని.. కానీ, అన్ని దేశాల్లో ఇవి ఒకే విధంగా ఉంటాయనే ఊహాజనిత నివేదికలపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. ముఖ్యంగా అమెరికా, యూరప్‌లలో వయసుల వారీగా చోటుచేసుకుంటున్న మరణాలతో పోలుస్తూ భారత్‌లో కరోనా మరణాలను అంచనా వేయడాన్ని తప్పుబట్టింది.

భారత్‌లో కరోనా వైరస్‌ గురించి సమర్థమైన కాంటాక్ట్ ట్రేసింగ్‌ వ్యవస్థ ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అంతేకాకుండా కొవిడ్ కేసులు, మరణాల సంఖ్యను నమోదు చేసేందుకు ‘కింది నుంచి పైస్థాయి (జిల్లా-రాష్ట్రం-కేంద్రం)’ వ్యవస్థ ఉందని గుర్తుచేసింది. జిల్లాల్లో నమోదు చేసే వివరాలు తొలుత రాష్ట్ర ప్రభుత్వానికి.. అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే వ్యవస్థ ఉందని తెలిపింది. కొవిడ్‌ మరణాల నమోదుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కోడింగ్‌కు (ICD-10) అనుగుణంగా భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) మార్గదర్శకాల ప్రకారమే వాటిని నమోదు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదిలాఉంటే, కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 4లక్షల 18వేల మంది కొవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. పలు రాష్ట్రాలు కొవిడ్‌ మరణాలను సవరిస్తుండడంతో ఒక్కోరోజు వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్ర వీటిని సవరించడంతో జులై 21న ఒక్కరోజే 3వేలకుపైగా అధిక మరణాలు నమోదయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు