Covid Vaccine: జులై నాటికి 50కోట్ల డోసులు ఇచ్చి తీరుతాం!

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మందకొడిగా సాగుతోందంటూ వస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ముందస్తుగా నిర్ధేశించుకున్న లక్ష్యాల ప్రకారం వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతోందని స్పష్టం చేసింది.

Published : 27 Jul 2021 18:15 IST

పునరుద్ఘాటించిన కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ మందకొడిగా సాగుతోందంటూ వస్తోన్న ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ముందస్తుగా నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతోందని స్పష్టం చేసింది. ముఖ్యంగా జులై నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వస్తున్నవి తప్పుడు కథనాలని పేర్కొంది. ఇదివరకే చెప్పినట్లుగా జులై 31 నాటికి 51 కోట్ల డోసులను కచ్చితంగా సరఫరా చేసి తీరుతామని పునరుద్ఘాటించింది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టలేకపోతోందని వస్తోన్న విమర్శల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఈ ప్రకటన చేసింది.

జనవరి నుంచి జులై చివరినాటికి మొత్తం 51.60కోట్ల డోసులను రాష్ట్రాలకు సరఫరా చేస్తామని గతంలోనే అన్ని రాష్ట్రాలకు తెలియజేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందుకు తగినట్లుగానే వివిధ తయారీ సంస్థల నుంచి వ్యాక్సిన్‌లను సేకరిస్తున్నామని స్పష్టం చేసింది. ముందస్తు ప్రణాళికలకు అనుగుణంగానే ఆయా రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్‌లకు కేటాయిస్తున్నామని పేర్కొంది. ఇప్పటికే 45.7కోట్ల డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేశామని.. మిగతా 6.03కోట్ల డోసులు జులై 31నాటికి చేరుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. దీంతో వ్యాక్సిన్‌ పంపిణీలో ముందుగా చెప్పిన లక్ష్యాన్ని చేరుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ ధీమా వ్యక్తం చేసింది.

ఇదిలాఉంటే, రాష్ట్రాలకు సరఫరా చేసిన డోసుల్లో ఇప్పటికే 44.19కోట్ల డోసులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 9.9కోట్ల మంది పూర్తిస్థాయిలో (రెండు డోసులు) వ్యాక్సిన్‌ తీసుకున్నారని స్పష్టం చేసింది. కేవలం జూన్‌ నెలలోనే 11.97 కోట్ల డోసులను పంపిణీ చేయగా.. జులైలో ఇప్పటివరకు (జులై 26) 10.62 కోట్ల డోసులను ప్రజలకు అందించినట్లు తెలిపింది. సాధ్యమైనంత తొందరగా ప్రజలకు వ్యాక్సిన్‌ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని