Helicopter crash: హెలికాప్టర్‌ ప్రమాదం.. ప్రాణాలతో బయటపడిన కెప్టెన్‌ ఈయనే..!

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే గ్రూప్‌ కెప్టెన్ వరుణ్‌ సింగ్‌......

Published : 09 Dec 2021 01:54 IST

చెన్నై: ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కుప్పకూలిన ఘటనలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు మరో 11 మంది కన్నుమూశారు. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే గ్రూప్‌ కెప్టెన్ వరుణ్‌ సింగ్‌. తీవ్రంగా గాయపడిన ఆయన వెల్లింగ్టన్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వరుణ్‌ సింగ్‌ ఇండియన్‌ ఆర్మీలో ఆయన విశేష సేవలందించారు. ఈ ఏడాది ఆగస్టులోనే భారత ప్రభుత్వం వరుణ్‌ సింగ్‌ను శౌర్య చక్ర అవార్డుతో సత్కరించింది. గతేడాది తాను నడుపుతున్న యుద్ధ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ.. ధైర్య సాహసాలు, నైపుణ్యాన్ని ప్రదర్శించి ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా ల్యాండ్‌ చేశారు.

తమిళనాడులోని కోయంబత్తూర్‌, కూనూరు మధ్యలో హెలికాప్టర్‌ కూలిపోయిన ఘటనలో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌తోపాటు 11 మంది మృతిచెందారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు ఈ ఉదయం రావత్‌ దంపతులు, ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి తమిళనాడు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో పదమూడు మంది మృతిచెందినట్లు వాయుసేన అధికారికంగా ధ్రువీకరించింది. కాగా రావత్‌ సహా ఆర్మీ అధికారుల మృతి పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

Read latest National - International News and Telugu News

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని