Taslima Nasreen: బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయ్‌ : తస్లీమా

బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ పేర్కొన్నారు.

Published : 19 Oct 2021 18:54 IST

హిందూ, బౌద్ధులను మూడో తరగతి వారిగా చూస్తున్నారన్న రచయిత్రి

దిల్లీ: బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా అక్కడి మదర్సాలు ఛాందసవాదానికి కేంద్ర బిందువులుగా మారుతున్నాయన్న ఆమె.. షేక్‌ హసీనా ప్రభుత్వం మతాన్ని రాజకీయాలకు వాడుకుంటోందని ఆరోపించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్‌లో హిందూ, బౌద్ధమతస్థులను మూడో తరగతి పౌరులుగా మారడంతో పాటు అక్కడి పౌరుల్లో హిందూ వ్యతిరేక భావజాలం పెరిగిపోతుండడం ఆందోళన కలిగించే విషయమని తస్లీమా నస్రీన్‌ అభిప్రాయపడ్డారు.

బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీ వర్గంపై గత కొంతకాలంగా దాడులు పెరుగుతున్నాయి. తాజాగా దుర్గామాత మండపాలపై దుండగులు విధ్వంసం సృష్టించడం హింసకు దారితీసింది. ఆ ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి మైనార్టీ (హిందూ) కుటుంబాలపై దాడులకు తెగబడుతోన్న ఛాందసవాదులు.. 20ఇళ్లను తగలబెట్టడంతో పాటు దాదాపు 70ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ పరిణామాలపై స్పందించిన తస్లీమా నస్రీన్‌.. బంగ్లాదేశ్‌ను ఆ పేరుతో పిలవడం కూడా ఇష్టం లేదన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ ‘జిహాదిస్థాన్‌’గా మారిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వంతోపాటు అంతకుముందున్న ప్రభుత్వాలు కూడా మతాన్ని కేవలం రాజకీయ అవసరాల కోసమే వాడుకుంటున్నాయని అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడం కొత్తేమీ కాదని.. ఎంతోకాలంగా ఈ తరహా దాడులు కొనసాగుతూనే ఉన్నాయని తస్లీమా నస్రీమ్‌ పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, బంగ్లాదేశ్‌కు చెందిన తస్లీమా నస్రీన్‌.. అక్కడి హిందువులపై జరుగుతోన్న దాడులను ప్రస్తావిస్తూ 1993లో ఆమె రాసిన ‘లజ్జా’ నవల వివాదాస్పదమైంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ నవలను నిషేధించింది. అనంతరం సొంత దేశంలో ఆమెపై వ్యతిరేకత మొదలయ్యింది. అంతేకాకుండా అక్కడి ఛాందసవాదుల నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయి. దీంతో 1994లో బంగ్లాదేశ్‌ను వీడిన తస్లీమా.. కొంతకాలంపాటు భారత్‌లో తలదాచుకున్నారు. అయితే, అప్పుడు ఆ నవలలో పేర్కొన్న సంఘటనలే ఇంకా బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్నాయని తస్లీమా నస్రీన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని