Gulabrao Patil: రోడ్లను హేమమాలిని బుగ్గలతో పోల్చిన మంత్రి.. స్పందించిన నటి

రహదారులను ప్రముఖ నటీమణుల బుగ్గలతో పోల్చి తరచూ వివాదాల్లో నిలుస్తుంటారు కొందరు రాజకీయ నేతలు.

Updated : 20 Dec 2021 15:29 IST

ముంబయి: రహదారులను ప్రముఖ నటీమణుల బుగ్గలతో పోల్చి తరచూ వివాదాల్లో నిలుస్తుంటారు కొందరు రాజకీయ నేతలు. ఇటీవల రాజస్థాన్‌కు చెందిన ఓ మంత్రి తన నియోజక వర్గంలోని రోడ్లను కత్రినా కైఫ్ బుగ్గలతో పోల్చగా.. తాజాగా మహారాష్ట్ర మంత్రి గులాబ్‌రావు పాటిల్‌ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. జల్గావ్‌ జిల్లాలోని తన నియోజకవర్గంలో రోడ్లను ప్రముఖ నటి హేమమాలిని బుగ్గలతో పోల్చి మంత్రి వివాదంలో చిక్కుకున్నారు.

ఇటీవల ఓ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో రోడ్లను ఎంతగా బాగా అభివృద్ధి చేశానో విపక్ష నేతలు వచ్చి చూడాలని సవాలు విసిరారు. అవి హేమమాలిని బగ్గల్లా నున్నగా ఉన్నాయంటూ పాటిల్‌ వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై మంత్రి క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్ డిమాండ్ చేసింది.

కాగా, ఈ వ్యాఖ్యలపై శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. ‘గతంలో కూడా ఇలాంటి పోలికలు మనం విన్నాం. ఇది హేమమాలినికి దక్కిన గౌరవం. ఈ విషయాన్ని నెగెటివ్‌గా చూడకండి. గతంలో లాలూ ప్రసాద్ యాదవ్‌ కూడా ఇలాంటి పోలిక తెచ్చారు. మేం హేమమాలినిని గౌరవిస్తాం’ అంటూ సమర్థింపు ధోరణిలో మాట్లాడారు. దీనిపై హేమమాలినిని మీడియా ప్రశ్నించింది. ‘లాలూ ప్రసాద్ యాదవ్‌జీ ఇలానే పోల్చి గతంలో మాట్లాడారు. ఆయన మొదలు పెట్టిన ట్రెండ్‌ను ఇప్పుడు మిగతా నేతలు అనుసరిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వినడానికి అంత బాగోవు’ అంటూ ఆమె సమాధానమిచ్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని