Amit Shah-CMs meet: 10రాష్ట్రాల సీఎంలతో భేటీ కానున్న అమిత్‌ షా!

దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ ఆదివారం భేటీ కానున్నారు.

Published : 24 Sep 2021 23:00 IST

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలపై 26న సమీక్ష

దిల్లీ: దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ ఆదివారం భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, ఒడిశా, బిహార్‌, పశ్చిమబెంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌తో పాటు కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 10మంది ముఖ్యమంత్రులు నేరుగా హాజరయ్యే ఈ సమావేశంలో.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితితో పాటు రోడ్లు, వంతెనలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల వంటి అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమీక్షించనున్నారు.

ఇదిలాఉంటే, కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం దేశంలో మావోయిస్టుల హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయి. దేశవ్యాప్తంగా కేవలం 45 జిల్లాల్లోనే వీటి ప్రభావం కొనసాగుతోంది. అయినప్పటికీ దాదాపు 90 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత జిల్లాలుగానే గుర్తించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ వామపక్ష తీవ్రవాద (LWE) కార్యకలాపాల కారణంగా 2019లో 61 జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా 2020లో అవి 45 జిల్లాలకే పరిమితమైనట్లు పేర్కొంది. 2015-2020 మధ్య కాలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మొత్తం 380 భద్రతా సిబ్బంది, 1000 మంది పౌరులతో పాటు 900 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో దాదాపు 4200 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లు కేంద్ర హోంశాఖ గణాంకాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని