Gujarat: ‘ప్రజలు ఏం తినాలో మీరెలా నిర్ణయిస్తారు’.. ఏఎంసీపై హైకోర్టు అసహనం

ప్రజలకు నచ్చినవి తినకుండా నియంత్రించే హక్కు మీకెక్కడదని అహ్మదాబాద్​ మున్నిపల్​ కార్పొరేషన్​ను (ఏఎంసీ) గుజరాత్​ హైకోర్టు ప్రశ్నించింది......

Updated : 11 Dec 2021 14:31 IST

అహ్మదాబాద్‌: ప్రజలకు నచ్చినవి తినకుండా నియంత్రించే హక్కు మీకెక్కడదంటూ అహ్మదాబాద్​ మున్నిపల్​ కార్పొరేషన్​ను (ఏఎంసీ) గుజరాత్​ హైకోర్టు ప్రశ్నించింది. ఆక్రమణల తొలగింపు పేరుతో అధికార దుర్వినియోగానికి పాల్పడవద్దని హెచ్చరించింది. బహిరంగంగా మాంసాహార విక్రయంపై కార్పొరేషన్​ విధించిన నిషేధాన్ని తప్పుబడుతూ వీధివ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్​పై ఈ విధంగా స్పందించింది. రోడ్డు ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ వీధి వ్యాపారులపై గుజరాత్​లోని అహ్మదాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఇటీవల చర్యలు చేపట్టింది. అయితే మాంసాహార విక్రయదారులే లక్ష్యంగా.. కార్పొరేషన్​ ఈ చర్యలు చేపడుతోందని వీధి వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సుమారు 25 మంది వ్యాపారులు ఏఎంసీ చర్యల్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

ఈ వ్యవహారంలో ఏఎంసీపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ బిరేన్‌ వైష్ణవ్‌ మాట్లాడుతూ.. ‘బయటకు వస్తే మేము ఏం తినాలో కూడా మీరే నిర్ణయిస్తారా? ప్రజలు వాళ్లకు నచ్చినవి తింటారు. భవిష్యత్‌లో చెరకురసం తాగకండి.. షుగర్​ వస్తుందని చెబుతారా? ఆక్రమణల పేరుతో మాంసాహారాన్ని విక్రయించకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. కొంతమంది ఇగోని సంతృప్తిపరిచేందుకు ఇలాంటి పనులు చేయొద్దు’ అంటూ ఘాటుగా స్పందించారు.

ప్రభుత్వం మాంసాహార విక్రయదారులను లక్ష్యం చేసుకుని చర్యలు చేపడుతోందన్న వాదనలో నిజం లేదని కోర్టుకు తెలిపారు ఏఎంసీ తరపు న్యాయవాది. ప్రభుత్వం చేపడుతున్న ఆక్రమణలపై పలువురికి తప్పుడు అభిప్రాయం కలిగిందన్నారు. పాదచారులకు ఇబ్బందులు కలుగుతుండటంతోనే ఏఎంసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆక్రమణలకు సంబంధించిన ఫొటోలను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ వాదనలు విన్న కోర్టు.. 24 గంటల్లోగా వ్యాపారుల సామగ్రిని వారికి అప్పగించాలని తీర్పునిచ్చింది. ప్రభుత్వ చర్యలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలను మానవ హక్కుల కార్యకర్తలు స్వాగతించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని