China: ‘గుండెల్లో గూడు’ కట్టేందుకు చైనా యత్నాలు..!

చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌  ట్విటర్‌ (twitter) ఖాతాలో ఓ ట్వీట్‌ చేస్తుంది.. ఆ తర్వాత ఆ ట్వీట్‌ వైరల్‌గా మారుతుంది.. చాలా పాశ్చాత్య దేశాల్లో వార్తగా నిలుస్తుంది.. ఇక్కడ ఒక్క చోట లాజిక్‌ కనిపించదు..

Published : 05 Jan 2022 02:04 IST

 ప్రచార యుద్ధతంత్రంపై డ్రాగన్‌ పట్టు..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనా అధికారిక పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ట్విటర్‌ (twitter) ఖాతాలో ఓ ట్వీట్‌ చేస్తుంది.. తర్వాత ఆ ట్వీట్‌ వైరల్‌గా మారుతుంది.. చాలా పాశ్చాత్య దేశాల్లో అది వార్తగా నిలుస్తుంది.. అయితే ఇక్కడ లాజిక్‌కు అందని విషయం ఏంటంటే.. వాస్తవానికి ట్విటర్‌ను చైనాలో అధికారికంగా బ్లాక్‌ చేశారు. అంటే చైనా వార్తసంస్థలు చేసే ట్వీట్లు సగటు చైనా పౌరుడు చదవడు..! గ్లోబల్‌ టైమ్స్‌, జిన్హూవా లేదా మరేదైనా పత్రికలను చైనీయులకు వార్తలు అందించేందుకు అక్కడి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి ఎవరి కోసం ట్విటర్‌లో ట్వీట్లు చేస్తున్నట్లు..? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగిలిన దేశాల మీడియాల్లో ఎటువంటి వార్త రావాలనుకుంటే .. వాటికి సంబంధించిన అంశాలను చైనా వార్తా సంస్థలు ట్వీట్‌ చేస్తాయి. ఈ రకంగా ఆయా దేశాల్లో ప్రజల అభిప్రాయాలను తనకు అనుగుణంగా మార్చుకొని డ్రాగన్‌ అనుకున్న లక్ష్యాలను సాఫీగా సాధిస్తోంది.

పశ్చిమ దేశాల పలుకుబడిని అడ్డుకోవడానికి మీడియాను చైనా (china)  ఓ పదునైన ఆయుధంగా ఎంచుకొంది. ఇప్పటి వరకు ఈ రంగంలో ఆయా దేశాల హవా కొనసాగింది. తొలినాళ్లలో చైనా ఈ రంగంపై పెద్దగా వెచ్చించలేదు. చైనీయుల కోసం వార్తలను సెన్సార్‌ చేయడం.. విదేశీ పత్రికల జర్నలిస్టులను దేశం నుంచి బహిష్కరించడంపైనే దృష్టిపెట్టింది. కానీ, చైనా ఇప్పుడు బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ పేరుతో ప్రపంచ దేశాల్లో పాగా వేస్తోంది. ఈ సమయంలో వార్తల రూపంలో ప్రజాభిప్రాయాన్ని చైనాకు అనుకూలంగా ప్రభావితం చేయడం దానికి చాలా కీలకంగా మారింది. దాదాపు పదేళ్ల క్రితం నుంచి డ్రాగన్‌ కూడా మీడియా ద్వారా ఆయా దేశాల ప్రజల అభిప్రాయాలను చైనాకు అనుకూలంగా మార్చేందుకు యత్నాలు మొదలుపెట్టింది. దీనికి కరోనావైరస్‌ మహమ్మారిని కూడా వాడుకోవడానికి ప్రయత్నించింది. ఈ విషయం 2020లో ‘ఇంటర్నేషనల్‌  ఫెడరేషన్‌ ఆఫ్‌ జర్నలిస్ట్స్‌’(ఐఎఫ్‌జే) 50 దేశాల్లో నిర్వహించిన సర్వేలో తేలింది.

చైనా వ్యూహం ఇది..

2009 నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.49 వేల కోట్ల (6.6 బిలియన్‌ డాలర్లు)ను ప్రపంచ మీడియాలో చైనా (china) స్థానం బలోపేతం చేసేందుకు ఖర్చు చేసింది. అదే సమయంలో 2.8 బిలియన్‌ డాలర్లను పెట్టుబడుల రూపంలో పెట్టింది. వివిధ దేశాలకు చెందిన రిపోర్టర్లకు చైనాలో శిక్షణలు, ఎక్స్‌ఛేంజి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చైనా మీడియా సంఘాలు, విదేశీ జర్నలిస్టులతో చర్చాకార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. దీంతోపాటు చైనా మీడియా కంటెంట్‌ను విదేశీ మీడియా సంస్థలకు పూర్తి ఉచితంగా అందజేస్తోంది. ఆయా దేశాల స్థానిక మీడియా సంస్థలతో సహకార ఒప్పందాలు చేసుకొంటోంది. ఈ మొత్తం వ్యవహారానికి ఇటలీ మీడియా సంస్థ ‘ఏఎన్‌ఎస్‌ఏ’ మంచి ఉదాహరణ.

బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌(BRI)లో చేరిన తొలి జీ-7 దేశంగా ఇటలీ నిలిచింది. దీనిపై సంతకాలు జరిగే సమయంలో షీజిన్‌పింగ్‌ వరుస పెట్టి మీడియా ఒప్పందాలు చేసుకొన్నారు. ఇటలీ ప్రభుత్వ మీడియా సంస్థ ‘ఏఎన్‌ఎస్‌ఏ’ - చైనా మీడియా సంస్థ జిన్హూవా మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ప్రతి రోజూ 50 చైనా సానుకూల కథనాలను ప్రసారం చేయడంతోపాటు.. ‘ఏఎన్‌ఎస్‌ఏ’ ఎడిటోరియల్‌ బాధ్యతలు జిన్హూవాకు దఖలు పడ్డాయి. ఫలితంగా ఇటలీ వార్తా సంస్థను ఓ ఆయుధంగా చైనా వాడుకొంది. దీంతోపాటు సీసీటీవీ, చైనా ఇంటర్నేషనల్‌ రేడియోతో కూడా ఒప్పందాలు కుదిరాయి. బీఆర్‌ఐ  ప్రాజెక్టుకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడానికి.. ఎటువంటి విమర్శలు తలెత్తకుండా చూసుకోవడానికి వాడుకొంటోంది. సెర్బియా, చెక్‌ రిపబ్లిక్‌ దేశాల్లోని కీలక మీడియా సంస్థలపై చైనా ప్రభావం చాలా ఉంది. 2015లో చైనా కంపెనీ సీఈఎఫ్‌సీ చెక్‌ రిపబ్లిక్‌లోని ఎంపెరెసా మీడియా సంస్థలో వాటాలు కొనుగోలు చేసింది. టీవీ బార్రాంన్డావ్‌లో, టైడన్‌, ఇన్‌స్టింక్ట్‌ పత్రికలో స్థానం దక్కించుకొంది. ఫలితంగా వీటిల్లో చైనా వ్యతిరేక వార్తలు తగ్గాయి. పూర్తిగా చైనా సానుకూల వార్తలు వస్తున్నాయని ‘మ్యాప్‌ ఇన్‌ఫ్లూయన్స్‌ఈయూ’ అనే వ్యూహ సంస్థ పరిశోధనలో తేలింది.

తమ దేశ గొప్పలు చెప్పుకోవడంలో చైనా ఆగడంలేదని ‘ఫ్రీడమ్‌ హౌస్‌’లో డైరెక్టర్‌ సారా కుక్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రజాస్వామ్యాలను తక్కువ చేసి చూపడం, స్థానిక చట్టాలను అతిక్రమించడం, ఆయా మీడియా సంస్థలను ఆర్థికంగా బలహీన పర్చడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు.

చైనా గుప్పిట ఆఫ్రికా..

ఆఫ్రికా వంటి పేద ఖండంలో చాలా దేశాల్లో మీడియా దయనీయంగా ఉండటం చైనాకు కలసి వస్తోంది. చైనాకు ముడిసరుకుల సరఫరా, బీఆర్‌ఐ ప్రాజెక్టులో ఈ ఖండం చాలా కీలకం. కెన్యాలోని స్టార్‌ టైమ్స్‌ పేరిట చైనా కంపెనీ అత్యంత చౌకగా శాటిలైట్‌ టీవీ ప్యాకేజీలు అందిస్తోంది. దీనికి 30 దేశాల్లో 2.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వీటిలో చైనా ఛానల్స్‌, ఆఫ్రికా ఛానల్స్‌ ఉంటున్నాయి. 

కరోనా పాపం ఇతర దేశాలపై నెట్టేందుకు..

కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో తప్పుడు ప్రచారానికి మీడియాను విపరీతంగా వాడుకొంది. వుహాన్‌లో నిర్వహించిన మిలటరీ గేమ్స్‌లో అమెరికన్ల ద్వారా వైరస్‌ వ్యాపించిందని ఆరోపణలు చేసి.. దానికి బలమైన ప్రచారం కల్పించింది. అంతేకాదు.. ఇటలీలో కరోనా వైరస్‌ పుట్టిందని గ్లోబల్‌ టైమ్స్‌ (global times) కథనాలు వండి వార్చింది. హాంకాంగ్‌ విషయంలో చైనాకు అనుకూలంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న 23,750 ఖాతాలను ట్విటర్‌ (twitter) తొలగించింది. అయితే ఇలాంటివి 1.5 లక్షల ఖాతాల ద్వారా సమాచారాన్ని ప్రచారం చేసుకొన్నట్లు తేలింది. నిపుణులుగా చెప్పుకొంటూ కొందరు సోషల్‌ మీడియా ఖాతాలు తెరిచి.. చైనాకు అనుకూల వాదనలు తెరపైకి తెస్తున్నారని గత నెల బీబీసీ కథనం వెలువరించింది. గత నెల స్విస్‌ బయాలజిస్ట్‌గా చెప్పుకొంటూ విల్సన్‌ ఎడ్వర్డ్స్‌ పేరిట ఫేస్‌బుక్‌ ఖాతా చైనా అనుకూల ప్రచారం చేసినట్లు తేలింది. వాస్తవానికి ఆ పేరుతో ఏ నిపుణుడు లేడని.. అది చైనా మాయగా పలువురు పేర్కొన్నారు.

తూర్పు లద్దాఖ్‌ భారత్‌ సైన్యంపై పీపుల్స్ లిబరేషన్‌ ఆర్మీ ‘మైక్రోవేవ్‌’ ఆయుధంతో దాడి చేసినట్లు రెన్‌మిన్‌ విశ్వవిద్యాలయంలో జిన్‌ కానరాంగ్‌ అనే ప్రొఫెసర్‌ చెప్పినట్లు  2020 నవంబర్‌లో ‘ది టైమ్స్‌’ ‘ది ఆస్ట్రేలియన్‌’ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో భారత్‌లో గగ్గోలు మొదలైంది. కానీ, ఈ వార్తలు శుద్ధ అబద్ధమని భారత సైన్యం (Indian Army) ట్విటర్‌లో వివరణ ఇచ్చింది.

చైనాలో మాత్రం గీత దాటితే వేటే..!

చైనాలో ప్రతికూల వాదనలను ఏమాత్రం సహించదు. అక్కడ ట్విటర్‌, ఫేస్‌బుక్‌లపై నిషేధం ఉంది. ప్రజల అభిప్రాయాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా ప్రభుత్వ రంగ మీడియా వార్తలను వాడుకొంటుంది. ఇక విదేశీ మీడియా ప్రతినిధులపై సవాలక్ష ఆంక్షలు ఉంటాయి. ఒక్క 2020లోనే 18 మంది విదేశీ మీడియా ప్రతినిధులను బహిష్కరించిందని ‘ది ఫారెన్‌ కరస్పాండెంట్స్‌ క్లబ్‌ ఆఫ్‌ చైనా’ పేర్కొంది. కొత్తగా ఒక్క విదేశీ జర్నలిస్టుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న వారు కూడా చాలా వరకు చైనా ఇచ్చే సమాచారం పైనే ఆధారపడాల్సి ఉంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని