Rane warns Shiv Sena: శివసేన గురించి చాలా తెలుసు.. ఒక్కోటి బయటకు తీస్తా!

శివసేనపై విరుచుకుపడిన కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే.. పార్టీతోపాటు అందులోని నాయకుల గురించి చాలా విషయాలు తెలుసునని, ఒక్కోదాన్ని బయటకు తీస్తానని హెచ్చరించారు.

Published : 28 Aug 2021 02:15 IST

హెచ్చరించిన కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే

ముంబయి: కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే అరెస్టు తర్వాత మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేనపై ఆయన మండిపడుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి శివసేనపై విరుచుకుపడిన రాణే.. పార్టీతోపాటు అందులోని నాయకుల గురించి చాలా విషయాలు తెలుసునని, ఒక్కోదాన్ని బయటకు తీస్తానని హెచ్చరించారు. ముఖ్యంగా సోదరుడి భార్యపైనే యాసిడ్‌ పోయాలని ఎవరు ఎవరితో చెప్పారనే విషయం తనకు తెలుసునని అన్నారు. జన్‌ ఆశీర్వాద్‌ యాత్రలో భాగంగా రత్నగిరి జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి రాణే.. శివసేన నాయకులపై మండిపడ్డారు.

‘వారితో (Shiv Sena) నేను 39ఏళ్ల పాటు కలిసి పనిచేశాను. నాకు చాలా విషయాలు తెలుసు. సొంత సోదరుడి భార్యపైనే యాసిడ్‌ విసరాలని ఎవరు ఎవరితో చెప్పారో నాకు తెలుసు. అదేం సంస్కారం..?’ అని కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే  అన్నారు. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేను టార్గెట్‌ చేసిన రాణే.. కేంద్ర మంత్రిని అరెస్టు చేయడం వల్ల వారు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. వారికి సంబంధించిన ఒక్కో కేసును బయటకు తీసుకువస్తాన్నారు. ఇక శివసేన పార్టీకి చెందిన యువసేన విభాగం నేత సర్దేశాయ్‌ తన ఇంటిముందుకే వచ్చి బెదిరించాడని.. మరోసారి వస్తే మాత్రం తిరిగి వెళ్లలేడని పరోక్షంగా హెచ్చరించారు.

కేంద్ర మంత్రిగా ఉన్న నారాయణ్‌ రాణే, తన రాజకీయ ప్రస్థానాన్ని శివసేనతోనే ఆరంభించారు. శివసేన కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టే స్థాయికి ఎదిగారు. 1999లో మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. కొన్ని నెలలపాటు పదవిలో కొనసాగారు. అనంతరం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై 2005లో ఆయనను పార్టీ నుంచి శివసేన తొలగించింది. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన నారాయణ్‌ రాణే.. 2017 వరకు అందులో కొనసాగారు. కాంగ్రెస్‌ను వీడిన అనంతరం 2017 అక్టోబర్‌లో మహారాష్ట్ర స్వాభిమాన్‌ పక్షా పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. 2018లో భాజపాకు మద్దతు ప్రకటించి ఆపార్టీ తరపున రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. చివరకు 2019లో ఆ పార్టీని భాజపాలో విలీనం చేశారు. ప్రస్తుతం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని