IAF Chopper Crash: బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్‌ ప్రమాదం.. రాజ్‌నాథ్‌కు చేరిన నివేదిక!

తమిళనాడులో చోటుచేసుకున్న ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనకు సంబంధించి నివేదికలోని విషయాలను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు భారత వాయుసేన అధికారులు బుధవారం తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Updated : 05 Jan 2022 15:36 IST

ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలో దర్యాప్తు పూర్తి

దిల్లీ: తమిళనాడులో చోటుచేసుకున్న ఐఏఎఫ్‌ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనపై ఇప్పటికే దర్యాప్తు పూర్తయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి నివేదికలోని విషయాలను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు భారత వాయుసేన అధికారులు బుధవారం తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్‌ ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమా?లేక తప్పనిసరి పరిస్థితుల్లో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు ప్రయత్నించారా? వంటి అన్ని కోణాలను త్రివిధ దళాలతో కూడిన సంయుక్త దర్యాప్తు బృందం పరిశీలించినట్లు తెలిసింది. అయితే, చివరకు సాంకేతిక లోపం లేదా మానవ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరగలేదనే నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

2021, డిసెంబర్‌ 8న భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 13 మంది ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌ తమిళనాడులోని కూనూరు ప్రాంతంలో కుప్పకూలింది. నాటి దుర్ఘటనలో హెలికాప్టర్‌లో ఉన్నవారందరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనపై దర్యాప్తు చేసేందుకు విమాన ప్రమాదాల దర్యాప్తులో విస్తృత నైపుణ్యమున్న ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలో త్రివిధ దళాలతో కూడిన కమిటీ ఏర్పాటైంది. హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణాలపై అన్ని కోణాలనూ పరిశీలించిన ఈ బృందం ఇటీవలే నివేదికను రూపొందించింది. తాజాగా ఈ నివేదికలోని అంశాలను కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు తెలియజేసినట్లు సమాచారం. దర్యాప్తు ప్రక్రియ మొత్తం న్యాయపరమైన విధివిధానాలకు అనుగుణంగా జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే, ఈ దర్యాప్తునకు నాయకత్వం వహించిన ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ ప్రస్తుతం బెంగళూరులోని ఐఏఎఫ్‌ శిక్షణా కేంద్రానికి చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని