Helicopter Crash: హెలికాప్టర్‌ ప్రమాదంపై ఊహాగానాలు వద్దు.. వాయుసేన ప్రకటన

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్‌) బిపిన్ రావత్ ఆకస్మిక మరణం ప్రతిఒక్కరిని కలచివేసింది. రావత్ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ తమిళనాడులో కుప్పకూలిపోవడంతో ఆయనతో సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Updated : 10 Dec 2021 16:19 IST

దిల్లీ: భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్‌) బిపిన్ రావత్ ఆకస్మిక మరణం ప్రతిఒక్కర్నీ కలచివేసింది. రావత్ ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ తమిళనాడులో కుప్పకూలిపోవడంతో ఆయనతో సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానిపై తాజాగా  భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) స్పందించింది. ఎటువంటి స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది. తాము దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేస్తామని ట్విటర్ వేదికగా వెల్లడించింది.

‘డిసెంబర్ 8, 2021న జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదానికి గల కారణాలను శోధిస్తున్నాం. అందుకోసం వైమానిక దళం ట్రై సర్వీస్ కోర్టు ఆఫ్ ఎక్వైరీ వేసింది. ఈ విచారణ త్వరితగతిన పూర్తవుతుంది. వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటివరకు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి మర్యాదను కాపాడాలి. ఎటువంటి సమాచారం లేని ఊహానాగాలకు దూరంగా ఉండాలి’ అని వైమానిక దళం విజ్ఞప్తి చేసింది.

ఈ హెలికాఫ్టర్ ఘటనపై ఇప్పటికే త్రివిధ దళాలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయని నిన్న పార్లమెంట్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో ఈ దర్యాప్తు సాగుతున్నట్లు తెలిపారు. మానవేంద్ర సింగ్ బృందం బుధవారమే వెల్లింగ్టన్‌కు చేరుకొని పని ప్రారంభించింది. అలాగే ఘటనా స్థలం నుంచి అధికారులు బ్లాక్‌ బాక్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దానిలో సమాచారాన్ని విశ్లేషించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని