Covid Treatment: కొవిడ్‌ చికిత్స నుంచి HCQ, ఐవర్‌మెక్టిన్‌ తొలగింపు..!

కొవిడ్‌ చికిత్సలో భాగంగా దేశంలో ఉపయోగిస్తోన్న ఔషధాలపై భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) తాజా సూచనలు చేసింది. ఐవర్‌మెక్టిన్‌ (Ivermectin), హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (HCQ) ఔషధాలను కొవిడ్‌ చికిత్స మార్గదర్శకాల జాబితా నుంచి తొలగించింది

Published : 24 Sep 2021 19:53 IST

దిల్లీ: కొవిడ్‌ చికిత్సలో భాగంగా దేశంలో ఉపయోగిస్తున్న ఔషధాలపై భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) తాజా సూచనలు చేసింది. ఐవర్‌మెక్టిన్‌ (Ivermectin), హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (HCQ) ఔషధాలను కొవిడ్‌ చికిత్స మార్గదర్శకాల జాబితా నుంచి తొలగించింది. బాధితుల్లో కొవిడ్‌ వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడంలో ఐవర్‌మెక్టిన్‌, హెచ్‌సీక్యూ ఔషధాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయనేందుకు సరైన ఆధారాలు లభించకపోవడంతోనే ఐసీఎంఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దేశంలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ అత్యవసర వినియోగం కింద బాధితులకు వ్యాధి తీవ్రతను బట్టి పలు రకాలైన ఔషధాలను వాడవచ్చని ఐసీఎంఆర్‌ సూచించింది. ఇందులో భాగంగా ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌తో పాటు మరికొన్ని ఔషధాలను కొవిడ్‌-19 చికిత్స (Covid Treatment) మార్గదర్శకాల్లో చేర్చింది. కానీ, వాటివల్ల ఆశించిన ఫలితాలు వస్తున్నట్లు ఆధారాలు లేకపోవడంతో తాజాగా మార్గదర్శకాల నుంచి తొలగించింది. అయితే, కొవిడ్‌ చికిత్సలో మరో రెండు ఔషధాలు రెమ్‌డెసివిర్‌ (Remdesivir), టోసిలిజమాబ్‌ (Tocilizumab) లను మాత్రం ప్రత్యేక సందర్భాల్లో వాడవచ్చని తెలిపింది. ముఖ్యంగా తీవ్ర లక్షణాలతో పదిరోజులకు పైగా బాధపడుతూ ఆక్సిజన్‌ అవసరమైన బాధితులకు రెమ్‌డెసివిర్‌ ఇవ్వవచ్చని సూచించింది. ఇక వ్యాధి తీవ్రత ఎక్కువగా లేదా ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి టోసిలిజమాబ్‌ను ఇవ్వవచ్చని కొవిడ్‌-19 చికిత్స మార్గదర్శకాల్లో ఐసీఎంఆర్‌ పేర్కొంది.

వీటితో పాటు స్వల్ప లక్షణాలున్న వారు ఇండోర్‌ ప్రాంతంలో ఉన్న సమయంలోనూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. కొవిడ్‌ లక్షణాలున్న వారు జ్వరాన్ని, దగ్గును నిరోధించే ఔషధాలతో పాటు మల్టీ విటమిన్లను తీసుకోవచ్చని సూచించింది. ఒకవేళ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరం, దగ్గు ఐదు రోజులకుపై ఉన్నా వైద్యుల వద్దకు వెళ్లాలని ఐసీఎంఆర్‌ తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఇక కొవిడ్ తీవ్రత, మరణాలు ఎక్కువగా 60ఏళ్లపైబడిన వారిలోనే ఉంటున్నట్లు ఐసీఎంఆర్‌ పేర్కొంది. ముఖ్యంగా గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు, అధిక రక్తపోటు, దీర్ఘ కాలం పాటు ఊపిరితిత్తులు/ మూత్రపిండాలు/ కాలేయ సమస్యలు, మధుమేహ సమస్యలతో బాధపడుతున్నవారితో పాటు రోగనిరోధకత తక్కువగా ఉండే ఇతర ఆరోగ్య సమస్యలున్నవారికే ఈ ముప్పు అధికంగా ఉన్నట్లు ఐసీఎంఆర్‌ అభిప్రాయపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని