IMA: మధుమేహులకు సత్వర టీకా.. అవసరమైతే బూస్టర్‌ ఇవ్వండి!

కొవిడ్‌-19 ముప్పు అధికంగా పొంచివున్నందున దేశంలోని మధుమేహులందరికీ తొలుత వ్యాక్సిన్‌ అందించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) డిమాండ్‌ చేసింది.

Published : 15 Nov 2021 01:28 IST

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్ (IMA) డిమాండ్‌

దిల్లీ: కొవిడ్‌-19 ముప్పు అధికంగా పొంచివున్నందున దేశంలోని మధుమేహులందరికీ తొలుత వ్యాక్సిన్‌ అందించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (IMA) డిమాండ్‌ చేసింది. అవసరమైతే వారికి మూడోడోసు (Booster Dose) కూడా అందించాలని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మధుమేహ (Diabetes) దినోత్సవం సందర్భంగా 10రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఐఎంఏ ప్రారంభించింది. దాదాపు 100కోట్ల మందికి మధుమేహంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఐఎంఏ వెల్లడించింది.

ఐడీఎఫ్‌ (International Diabetes Federation) నివేదిక ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది (2021)లోనే దాదాపు 67లక్షల మంది మరణానికి మధుమేహం కారణమయ్యింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 53కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 64 కోట్లకు.. 2045వచ్చేసరికి 78 కోట్లకు చేరుతుందని అంచనా. ఇక భారత్‌లోనూ ప్రస్తుతం 7.7కోట్ల మంది మధుమేహంతో బాధపడుతుండగా.. 2045నాటికి ఈ సంఖ్య 13 కోట్లకు పెరగవచ్చని అంచనా. భారత్‌లో పట్టణాలు, మెట్రోనగరాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఇదివరకు ఎన్నడూ లేనంత ఎక్కువగా మధుమేహం బారినపడుతున్నట్లు వెల్లడైంది. ఒత్తిడి, జంక్‌ ఫూడ్‌, ధూమపానం, మద్యం సేవించడం, సుదీర్ఘ సమయం కూర్చొనడం వంటి జీవన విధానంలో మార్పుల వల్ల ఇవి మరింత ఎక్కువ అవుతున్నట్లు పేర్కొంది.

మహిళల్లోనే ఎక్కువ..

పురుషులతో పోలిస్తే మధుమేహం ముప్పు మహిళలకే ఎక్కువ ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. మధుమేహం బారినపడుతున్న వారిసంఖ్య పెరుగుతున్నప్పటికీ దాదాపు 57శాతం కేసులు నిర్ధారణ కావడం లేదు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పేర్కొంది. సరైన సమయంలో వైద్యం తీసుకోకుంటే దుష్ర్పభావాల ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మధుమేహాన్ని సాధ్యమైనంత తొందరగా గుర్తించేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించింది.

ఇన్సులిన్‌కు వందేళ్లు..

శరీరంలోని చక్కెర నిల్వలను నియంత్రించడంలో కీలకంగా వ్యవహరించే ‘ఇన్సులిన్‌’ను 1922లో చార్లెస్‌ బెస్ట్‌తో కలిసి సర్‌ ఫ్రెడెరిక్‌ బాంటింగ్‌ రూపొందించారు. అయితే ఇది అందుబాటులోకి వచ్చి వందేళ్లైనా మధుమేహంతో బాధపడుతున్న వారికి అవసరమైన సంరక్షణ అందుబాటులో లేదని ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. మధుమేహం వల్ల కలిగే అనర్థాలను తెలుసుకోవడంతో పాటు చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం ఎంతో కీలకమని పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు