Covid-19: గుండెపోటు ముప్పు 3 రెట్లు అధికం..?

కొవిడ్‌-19 బారినపడే వారిలో తొలి రెండు వారాల్లో గుండెపోటు ముప్పు మూడురెట్లు ఎక్కువగానే ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Published : 04 Aug 2021 01:42 IST

లాన్సెట్‌ జర్నల్‌లో స్వీడన్‌ నిపుణుల అధ్యయన నివేదిక

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 బారినపడిన వారిలో చాలా మంది భయంతోనే ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కొవిడ్‌-19 బారినపడే వారిలో తొలి రెండు వారాల్లో గుండెపోటు ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన నివేదిక ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’లో ప్రచురితమైంది.

కొవిడ్‌ రోగులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను అంచనా వేసేందుకు స్వీడన్‌లోని ఉమెయా యూనివర్సిటీ పరిశోధకులు ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్‌ 14, 2020 వరకు ఓ అధ్యయనం చేపట్టారు. కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన 80వేల మందిని, మరో 3లక్షల 48వేల సాధారణ పౌరుల ఆరోగ్యంతో పోల్చి చూశారు. ఇందులో భాగంగా కొవిడ్‌-19 బారినపడిన వారిలో తొలి రెండు వారాల్లో గుండె గోడ కండరాలకు సంబంధించిన (గుండెపోటు) సమస్యతో పాటు స్ట్రోక్‌ ముప్పు మూడు రెట్లు పెరిగినట్లు కనుగొన్నట్టు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఉమెయా యూనివర్సిటీ నిపుణులు ఓస్వాల్డో ఫాన్‌సెకా పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు (Comorbidities), వయసు, లింగము, సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చూసినా.. ఇదే విధమైన ఫలితాలు వచ్చినట్లు చెప్పారు.

అందుకే వ్యాక్సిన్‌ కీలకం..

కొవిడ్-19 సోకిన వారిలో గుండె గోడ కండరములకు సంబంధించిన సమస్యల ముప్పును తాజా అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని ఉమెయా యూనివర్సిటీకి చెందిన మరో నిపుణుడు ఇయోఅన్నీస్‌ కట్సౌలారీస్‌ స్పష్టం చేశారు. అందుకే కొవిడ్‌ చికిత్సా విధానంలో వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. వీటితో పాటు వ్యాక్సిన్‌ తీసుకోవడం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా గుండెపోటు ముప్పు పొంచివున్న వృద్ధులు వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు.

అధ్యయనంలో భాగంగా స్వీడెన్‌ నేషనల్‌ హెల్త్ ఏజెన్సీ, నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ వెల్ఫేర్‌లో నమోదైన కొవిడ్‌ రోగుల సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్నారు. అంతకుముందే గుండెపోటు వచ్చిన వారి జాబితాను ఈ అధ్యయనం నుంచి తొలగించారు. ఒకవేళ వారిని పరిగణలోకి తీసుకుంటే గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేయడం కష్టంగా మారుతుందని అధ్యయనంలో పాల్గొన్న మరో నిపుణులు క్రిస్టర్‌ లిండ్‌మార్క్‌ పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ వ్యాక్సిన్‌ ప్రాధాన్యతలను తాజా అధ్యయనం మరోసారి గుర్తుచేస్తోందని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని