India-Pak: అణు స్థావరాల వివరాలను ఇచ్చిపుచ్చుకున్న భారత్‌-పాక్‌

మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారత్‌, పాకిస్థాన్​ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి......

Published : 01 Jan 2022 19:08 IST

దిల్లీ: మూడు దశాబ్దాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారత్‌, పాకిస్థాన్​ తమ దేశాల్లోని అణు స్థావరాల జాబితాను ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి దేశంలోని అణు కేంద్రాలపై మరో దేశం దాడి చేయకూడదనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను అందజేసుకున్నాయి. ఇరుదేశాలు ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేసినట్లు భారత విదేశాంగ శాఖ శనివారం వెల్లడించింది. ‘దౌత్యమార్గాల ద్వారా భారత్, పాకిస్థాన్​ తమ అణు స్థావరాల జాబితాను పంచుకున్నాయి. ఏకకాలంలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ జాబితాను ఇలా ఇచ్చిపుచ్చుకోవడం ఇది వరుసగా 31వ సారి’ అని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

అణు స్థావరాలపై దాడులకు వ్యతిరేకంగా కుదిరిన ‘ఎటాక్స్ అగైనెస్ట్ న్యూక్లియర్ ఇన్స్​టాలేషన్స్ అండ్ ఫెసిలిటీస్’ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు ఈ వివరాలను పరస్పరం అందజేసుకున్నాయి. 1988 డిసెంబర్ 31న ఈ ఒప్పందంపై భారత్, పాకిస్థాన్ సంతకం చేశాయి. ఏటా అణు స్థావరాల సమాచారం అందించుకోవాలని ఇందులోని ఆర్టికల్-2 నిబంధన స్పష్టం చేస్తుంది. దీని ప్రకారం 1992 జనవరి 1 నుంచి ప్రతి సంవత్సరం అదే రోజు అణు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి.

ఖైదీల వివరాలు కూడా..

అణు స్థావరాలతో పాటు పాక్​లో ఉన్న భారతీయ ఖైదీల వివరాలు, భారత్​లో ఉన్న పాక్ ఖైదీల వివరాలను కూడా ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకున్నాయి. భారత్​ కస్టడీలో ఉన్న 282 మంది పాక్‌ పౌరులు, 73 మంది మత్స్యకారుల వివరాలను దాయాది దేశానికి భారత విదేశాంగ శాఖ అదించింది. అదే సమయంలో పాక్ చెరలో ఉన్న 51 మంది పౌరులు, 577 మంది భారత మత్స్యకారుల వివరాలను పాకిస్థాన్ విదేశాంగ శాఖ అందించింది. 2008 మే 21న ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా శనివారం ఈ సమాచార మార్పిడి జరిగింది. ఒప్పందం ప్రకారం ఏటా రెండుసార్లు (జనవరి 1న, జులై 1న) ఖైదీల వివరాలను ఇచ్చిపుచ్చుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని