
26/11 Mumbai Attacks: మారణహోమానికి 13 ఏళ్లు.. పాక్ ద్వంద్వ ప్రమాణాలు!
ఆ గాయాలను భారత్ ఎన్నటికీ మరవదన్న ప్రధాని మోదీ
దిల్లీ: నవంబర్ 26, 2008న ముంబయిలో జరిగిన ఉగ్రదాడితో యావత్ ప్రపంచం వణికిపోయిన విషయం తెలిసిందే. భారత్‌తోపాటు మరో 14దేశాలకు చెందిన మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ మారణహోమం జరిగి నేటికి 13ఏళ్లు అయ్యింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముంబయి ఉగ్రదాడి గాయాలను భారత్ ఎన్నటికీ మరచిపోదని స్పష్టం చేశారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించిన ఆయన.. నూతన విధానం, సరికొత్త మార్గాల్లో ఉగ్రవాదంపై భారత్ పోరును కొనసాగిస్తోందన్నారు. ఇదే సమయంలో నాటి పేలుళ్ల సూత్రధారులను శిక్షించడంలో తాత్సారం చేస్తోన్న పాకిస్థాన్ తీరును భారత్ మరోసారి ఎండగట్టింది. ఈ అంశాన్ని పాకిస్థాన్ ముందు మరోసారి ప్రస్తావించిన భారత్.. నేరస్థులను న్యాయస్థానం ముందుకు తీసుకురావడంలో చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించింది. ఇకనైనా విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని దాయాది దేశంపై ఒత్తిడి తెచ్చింది.
ద్వంద్వ ప్రమాణాలు వీడాల్సిందే..
ముంబయి పేలుళ్లు ఘటన జరిగి 13 సంవత్సరాలైన సందర్భంగా పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్తకు భారత విదేశాంగశాఖ ఓ నోట్‌ను అందించింది. ‘13ఏళ్ల తర్వాత కూడా 166 మంది బాధితుల కుటుంబాలు న్యాయం కోసం ఎదిరుచూస్తూనే ఉన్నాయి. అయినా నేరస్థులను న్యాయస్థానం ముందుంచడంలో పాకిస్థాన్ చిత్తశుద్ధి కనబరచడం లేదు. ఉగ్రదాడికి వ్యూహరచన, అమలు, ప్రయోగం పాకిస్థాన్ భూభాగం నుంచే జరిగిందని స్పష్టంగా తెలుసు. ఈ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు వీడాలి. అత్యంత దారుణానికి పాల్పడిన వారిని న్యాయస్థానం ముందుంచాలి’ అని ఆ నోట్‌లో భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా ముంబయి పేలుళ్ల విషయంలో పాకిస్థాన్ చిత్తశుద్ధి కనిపించడం లేదని దుయ్యబట్టింది. ఇదే సమయంలో పాకిస్థాన్ భూభాగం నుంచి భారత్‌పై ఎటువంటి ఉగ్రదాడులు చోటుచేసుకోవనే నిబద్ధతకు పాక్ కట్టుబడి ఉండాలని భారత్ స్పష్టం చేసింది. ఇది కేవలం ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు జవాబుదారీతనంగా ఉండడం కాదని.. యావత్ ప్రపంచానికి పాకిస్థాన్ బాధ్యతగా ఉండాలని పేర్కొంది.
60 గంటలపాటు ఉగ్రదాడి..
ఇదిలాఉంటే, పాకిస్థాన్‌కు చెందిన పదిమంది ఉగ్రవాదులు.. నవంబర్ 26, 2008 సాయంత్రం కొలాబా సముద్రతీరం నుంచి ముంబయికి చేరుకొన్నారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ముష్కరులు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లోకి చొరబడ్డారు. వెంటనే వారిచేతుల్లో ఉన్న ఏకే-47 తుపాకులను తీసి తూటాల వర్షం కురిపించారు. అక్కడ కన్పించిన వారినల్లా పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని ఘటనలతో వణికిపోయిన అక్కడి ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌస్ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారిలో కేవలం భారతీయులే కాకుండా మరో 14 దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.