India Corona: కరోనా గణాంకాలు సానుకూలమే..ఒమిక్రాన్‌తోనే ఆందోళన..!

దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత కొంతకాలంగా పదివేలకు దిగువనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు.. క్రియాశీల కేసులపై ప్రభావం చూపుతున్నాయి.

Updated : 03 Dec 2021 12:01 IST

కొత్తగా 9,216 కొత్త కేసులు..391 మరణాలు

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. గత కొంతకాలంగా పదివేలకు దిగువనే కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. రోజువారీ కేసుల్లో హెచ్చుతగ్గులు.. క్రియాశీల కేసులపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.29 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.35 శాతంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 

గురువారం 11,57,156 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,216 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజుతో పోల్చితే కొత్త కేసులు కొద్దిగా తగ్గాయి. గత 60 రోజులుగా రోజువారీ సగటు పాజిటివిటీ రేటు 2 శాతం దిగువనే నమోదవుతోంది. నిన్న 8,612 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత ఏడాది ప్రారంభం నుంచి 3.46 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. 3.40 కోట్ల మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు.

ప్రస్తుతం క్రియాశీల కేసులు లక్ష దిగువనే ఉన్నప్పటికీ.. నిన్న కాస్త పెరిగాయి. వాటి సంఖ్య 99,976గా ఉంది. 24 గంటల వ్యవధిలో 391 మరణాలు వెలుగుచూశాయి. అందులో కేరళ వాటా 320గా ఉంది. నిన్నటి వరకు 4.7లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 

దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. నిన్నటివరకు 125 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం వెల్లడించింది. 46.3 కోట్ల మందికి పైగా రెండు డోసులు వేయించుకోగా.. 79.3 కోట్ల మంది మొదటి డోసు తీసుకున్నారు. నిన్న 73.67 లక్షల మంది టీకా వేయించుకున్నారు.

ఈ కరోనా గణాంకాలన్నీ కాస్త ఊరటనిస్తున్నప్పటికీ.. దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూడటమే ఆందోళన కలిగిస్తుంది. నిన్న ఇద్దరిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించారు. వారిలో తీవ్రమైన లక్షణాలు లేవని, ఎవరూ ఆందోళన చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్రం సూచించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని