india Corona: కొనసాగుతోన్న ఉద్ధృతి.. 37వేలకుపైగా కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌గా రూపాంతరం చెంది, ఉద్ధృతి చూపిస్తోంది. దాంతో వరుసగా రెండోరోజు 30వేలపైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కు చేరింది. మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.  

Updated : 04 Jan 2022 17:43 IST

98.13 శాతానికి తగ్గిన రికవరీ రేటు 

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విజృంభిస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వరుసగా రెండోరోజు 30వేలపైనే కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,892కు చేరింది. మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.

సోమవారం 11,54,302 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 37,379 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముందురోజు 33వేలకు పైగా నమోదైన కేసులు తాజాగా మరింత పెరిగాయి. ఒక్క మహారాష్ట్రలోనే 12,160 మందికి వైరస్‌ సోకింది. అందులో ముంబయి నుంచే 8,082 కేసులు ఉన్నాయి. అయితే వీరిలో 90 శాతం మందికి లక్షణాలు కనిపించడం లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  దిల్లీలో 4,099 మంది వైరస్ బారినపడ్డారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కరోనా సోకింది. అయితే లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉన్నాయి. ఇక కొత్త సంవత్సరం వేళ గోవాలో రోజూవారీ పాజిటివిటీ రేటు 10 శాతం దాటగా.. దేశవ్యాప్తంగా 3.24 శాతానికి చేరింది.

మరోపక్క దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ కొత్త వేరియంట్ కేసులు రెండు వేలకు సమీపించాయి. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 1,892గా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 192 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 568 మంది బాధితులున్నారు. దిల్లీలో ఈ రకం కేసులు 382కి పెరిగాయి. దేశంలో ఇప్పటి వరకూ 766 మంది కోలుకున్నారు.

* కొవిడ్‌తో చికిత్స పొందుతూ 24 గంటల వ్యవధిలో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ మొత్తంగా 4,82,017 మంది మహమ్మారికి బలయ్యారు.

కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 1,71,830కి చేరాయి. ఆ రేటు 0.49 శాతానికి పెరిగింది.

నిన్న ఒక్కరోజే 11,007 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. 3.43 కోట్ల (98.13 శాతం)మంది వైరస్‌ను జయించారు. గత కొద్ది రోజులుగా రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇక దేశంలో కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతోంది. నిన్న 99,27,797 మంది టీకా వేయించుకున్నారు. నిన్నటి నుంచి 15-18 ఏళ్ల మధ్య వయస్సు వారికి టీకా అందిస్తున్నారు. నిన్న సుమారు 40 లక్షల మంది ఆ వయస్సు వారు టీకా తీసుకున్నారు. గత ఏడాది జనవరి 16 నుంచి ఇప్పటివరకు 146.7 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని