India Corona: శరవేగంగా విస్తరిస్తోన్న మహమ్మారి.. 60 వేలకు చేరువలోకొత్త కేసులు

దేశంలో కరోనావైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ.. ఉద్ధృతి చూపిస్తోంది.

Updated : 05 Jan 2022 14:43 IST

దిల్లీ: దేశంలో కరోనావైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. శరవేగంగా విస్తరిస్తూ.. తన ప్రతాపాన్ని చూపిస్తోంది. రెండు రోజులుగా 30వేలకు పైగా నమోదయిన కొత్త కేసులు.. నేడు ఒక్కసారిగా 58 వేలకు చేరాయి. ముందురోజు కంటే 55 శాతం అధికంగా నమోదయ్యాయి. వేగంగా ప్రబలే లక్షణమున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ తాజా వ్యాప్తికి దోహదం చేస్తోంది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ కేసులు రెండు వేల మార్కు దాటేశాయి.

* మంగళవారం 13,88,647 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 58,097 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. దీంతో ఇప్పటి వరకూ దేశంలో 3.50 కోట్ల మంది వైరస్ బారిపడ్డారు.

* దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కలవరం పుట్టిస్తోంది. ఇప్పటివరకూ 2,135 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించారు. అందులో 828 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి ఇంటికి చేరుకున్నారు.  అత్యధికంగా మహారాష్ట్రలో 653 మంది దీని బారినపడగా.. దిల్లీలో ఆ సంఖ్య 464కి చేరింది. 24 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ విస్తరించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

* మరోవైపు దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2.14 లక్షలకు చేరి.. ఆ రేటు 0.61 శాతానికి పెరిగింది

* నిన్న 15,389 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.43 కోట్లుగా ఉన్నాయి. గత కొంతకాలంగా రికవరీల కంటే కొత్త కేసులే భారీగా ఉంటున్నాయి. రికవరీ రేటు 98 శాతానికి తగ్గిపోయింది.

* 24 గంటల వ్యవధిలో 534 మంది మరణించారు. కేరళ మునుపటి గణాంకాలను సవరిస్తుండటంతో.. మృతుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. మొత్తంగా ఇప్పటి వరకూ 4,82,551 మంది కరోనా కాటుకు బలయ్యారు.

* ఇక దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. నిన్న 96 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. గతేడాది జనవరి నుంచి 147 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది. 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారికి రెండు రోజుల వ్యవధిలో 80 లక్షలకు పైగా డోసులు అందించారు. 

దేశంలో థర్డ్‌వేవ్‌ మొదలైనట్లే..!
‘దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు వాటి సమీప ప్రాంతాల్లో కొత్తగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో 50శాతం వరకూ ఒమిక్రాన్‌ వేరియంట్‌వే ఉంటున్నాయి. ఇలా క్రమంగా కొవిడ్‌ కేసుల్లో భారీ పెరుగుదల కనిపించడం థర్డ్‌వేవ్‌కు సూచికమే. అయినప్పటికీ భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే దేశంలో 80శాతం మంది సహజంగానే వైరస్‌కు గురయ్యారు. దీనికితోడు 90శాతం మంది అర్హులు కూడా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. 65శాతం మందికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందింది’ అని కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోఢా వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని