India Corona: మళ్లీ భారత్‌ను తాకినకరోనా సునామీ.. ఒక్కరోజులో 90వేల కేసులు..!

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో 10 రెట్లు పెరిగి మహమ్మారి జూలు విదుల్చుతోంది. డిసెంబర్ 28న 9వేలకు పైగా కేసులు నమోదుకాగా..నిన్న 90వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి.

Updated : 06 Jan 2022 15:45 IST

3 లక్షలకు చేరువవుతోన్న క్రియాశీల కేసులు 

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. తొమ్మిది రోజుల వ్యవధిలో కేసులు 10 రెట్లు పెరిగి మహమ్మారి పంజావిసిరింది. డిసెంబర్ 28న దాదాపు 9వేలకు పైగా కేసులు నమోదుకాగా..నిన్న 90వేల పైచిలుకు కేసులు వచ్చాయి. ముందురోజు కంటే 56 శాతం అధికంగా కేసులు బయటపడ్డాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో మూడోవేవ్‌కు ఆజ్యం పోస్తోంది. ప్రస్తుతం ఆ వేరియంట్లో గుర్తించిన కేసులు 2,630కి చేరాయి. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. 

నిన్న 14,13,030 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. అందులో 90,928 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. గతేడాది రెండో వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న సమయంలో జూన్‌ నెలలో ఈ స్థాయిలో కేసులు వెలుగుచూశాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 6.43 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 26 వేలు, పశ్చిమ్ బెంగాల్‌లో 14 వేలు, దిల్లీలో 10 వేలకుపైగా కేసులొచ్చాయి. మొత్తం కేసులు 3.51 కోట్లకు చేరాయి. 

దేశంలో ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. మెట్రో నగరాల్లో 50 శాతానికి పైగా కేసులకు ఈ వేరియంటే కారణమని నిపుణులు భావిస్తున్నారు. గణాంకాల్లో చూపిన దాని కంటే ఈ వేరియంట్ కేసులు ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య 2,630కి చేరింది. నిన్న కొత్తగా 495 మంది దీని బారినపడ్డారు. 26 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 797 మందికి ఈ కొత్త వేరియంట్‌ సోకింది. దిల్లీలో ఆ సంఖ్య 465కి పెరిగింది. మొత్తంగా 995 మంది కోలుకున్నారు.

వైరస్ విజృంభిస్తుండటంతో  క్రియాశీల కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 2,85,401 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.81 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 97.81 శాతానికి తగ్గిపోయింది. నిన్న 19,206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.43 కోట్లకు చేరాయి. 24 గంటల వ్యవధిలో 325 మరణాలు సంభవించాయి. గత రెండు సంవత్సరాల్లో 4,82,876 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. 

మరోపక్క దేశంలో టీకా కార్యక్రమం వేగంగా సాగుతోంది. ఈ ఒమిక్రాన్ వేళ.. ఇది ఒక్కటే ఊరటనిచ్చే అంశం. జనవరి మూడు నుంచి 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు వారికి కూడా టీకా అందిస్తున్నారు. ఈ మూడు రోజుల వ్యవధిలో కోటి మందికి పైగా టీకా తీసుకున్నారు.  నిన్న 91 లక్షలమందికి టీకా అందింది. ఇప్పటివరకూ 148 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని