Published : 22 Sep 2021 17:30 IST

Pfizer, Moderna: భారత్‌లో.. ఫైజర్‌, మోడెర్నా టీకాలు ఇప్పట్లో రానట్లేనా!

దేశీయంగానే లభ్యత పెరిగిందన్న కేంద్ర ప్రభుత్వవర్గాలు

దిల్లీ: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే ఫైజర్‌, మోడెర్నా టీకాలు భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేనట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికి వీటిని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా దేశీయంగా తయారవుతోన్న వ్యాక్సిన్‌ డోసుల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో పాటు తక్కువ ఖర్చులోనే లభ్యమవుతుండడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో అతిపెద్ద మార్కెట్‌గా భావిస్తోన్న భారత్‌లో ఈ రెండు టీకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో అందుబాటులో ఉండే అవకాశం తక్కువగా ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, మోడెర్నా సంస్థలు తయారు చేసిన టీకాలు 90శాతానికిపైగా సమర్థతతో పనిచేస్తున్నాయని ఇప్పటికే వెల్లడైంది. భారత్‌లో అత్యవసర వినియోగం కింద మోడెర్నా ఇప్పటికే అనుమతి పొందగా.. ఫైజర్‌కు మాత్రం అనుమతి కోసం మరోసారి దరఖాస్తు చేసుకోలేదు. అయితే, మహమ్మారి విజృంభణ కొనసాగుతోన్న వేళ.. ప్రైవేటు సంస్థలకు విక్రయించబోమని ఆ సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. కేవలం ప్రభుత్వ మార్గాల ద్వారానే ఆయా దేశాలకు సరఫరా చేస్తామని స్పష్టం చేశాయి. కానీ, భారత ప్రభుత్వం మాత్రం ప్రస్తుతానికి ఆ రెండు వ్యాక్సిన్లను సేకరించేందుకు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ల ధర, నిర్వహణ సమస్యలతోనే ప్రభుత్వం వాటికి దూరంగా ఉండనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ధర కూడా భారమే..!

భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించిన తొలినాళ్లలో వ్యాక్సిన్‌ కొరత ఏర్పడింది. అప్పట్లో ఆయా సంస్థలకు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి. అలా వచ్చిన వాటిలో ఫైజర్‌, మోడెర్నా వంటి టీకాల ధర ఎక్కువ కావడంతో పాటు ఆయా సంస్థలు కొన్ని నిబంధనలు పెడుతున్నాయి. అలాంటప్పుడు వారి డిమాండ్లను మనమెందుకు తలొగ్గాలి అని భారత్‌లో వ్యాక్సిన్‌ వ్యవహారాలను చూస్తోన్న కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఫైజర్‌, మోడెర్నా నుంచి ప్రస్తుతానికి వ్యాక్సిన్‌ డోసులను సేకరించే అవకాశం లేదని మరో అధికారి పేర్కొన్నారు. ఏవైనా దుష్ర్పభావాలు ఎదురైతే న్యాయపరంగా ఎదురయ్యే సమస్యలకు బాధ్యత వహించే ఇండెమ్నిటీ విషయంలోనూ ఇప్పటివరకు ఏ సంస్థకీ భరోసా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఫైజర్‌ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అయితే, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. భారత్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ఫైజర్‌ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

ఇక మోడెర్నాకు ఇప్పటికే అనుమతి లభించినప్పటికీ వ్యాక్సిన్‌ నిల్వకు తక్కువ ఉష్ణోగ్రతలు అవసరం కావడం ఓ సవాలుగా మారినట్లు తెలుస్తోంది. దీంతో సరఫరా, పంపిణీలోనూ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొవిషీల్డ్‌తో పోలిస్తే వీటి ధర కూడా ఎక్కువగా ఉండడంతో వీటి సేకరణకు కేంద్రప్రభుత్వం సుముఖత చూపకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రైవేటులో మాత్రం లభ్యమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో అమెరికాకు చెందిన సింగిల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే&జే) అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అక్టోబర్‌లో జే&జే వ్యాక్సిన్‌ సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి స్థానిక సంస్థ బయోలాజికల్‌ ఇ తో జే&జే ఇప్పటికే ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

గణనీయంగా పెరిగిన ఉత్పత్తి..

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 80కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఇదే సమయంలో దేశీయంగా వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని గణనీయంగా పెంచే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఒక్క అక్టోబర్‌లోనే దాదాపు 30కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో దాదాపు 22కోట్ల డోసులను కేవలం సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచే అందుబాటులో ఉండనున్నాయి. ఇక భారత్‌ బయోటెక్‌ కూడా అక్టోబర్‌లో దాదాపు 5కోట్ల డోసులను అందిస్తామని పేర్కొంది. వీటితో పాటు స్పుత్నిక్‌-వీ కూడా దేశీయంగానే ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలోనే మిగులు టీకాలను విదేశాలకు ఎగుమతి చేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో ఫైజర్‌, మోడెర్నా టీకాలను భారత ప్రభుత్వం ప్రస్తుతానికి కొనుగోలు చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts