India-Russia: బలంగానే భారత్‌, రష్యా సంబంధాలు : జయశంకర్‌

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ భారత్‌, రష్యా దేశాల మధ్య సంబంధాలు సుస్థిరంగా, బలంగా ఉన్నాయని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జయశంకర్‌ ఉద్ఘాటించారు.

Updated : 06 Dec 2021 16:28 IST

ఇరు దేశాల విదేశాంగ, రక్షణశాఖ మంత్రుల ‘2+2’ సమావేశం

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికీ భారత్‌, రష్యా దేశాల మధ్య సంబంధాలు సుస్థిరంగా, బలంగా ఉన్నాయని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జయశంకర్‌ ఉద్ఘాటించారు. అంతేకాకుండా ఇరుదేశాల భాగస్వామ్యం ఎంతో ప్రత్యేకమైనదన్నారు. దిల్లీలోని సుష్మాస్వరాజ్‌ భవన్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌తో సమావేశమైన ఎస్‌.జైశంకర్‌.. చర్చల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రష్యా రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగుతో భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సమావేశమయ్యారు. రక్షణ రంగంలో వివిధ అంశాలపై ఇరువురు మంత్రులు చర్చలు జరిపారు.

భారత్‌, రష్యాల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరికొంత సేపట్లో దిల్లీ చేరుకోనున్నారు. ఈ కీలక సమావేశానికి ముందే ఇరు దేశాల రక్షణ, విదేశాంగ శాఖల మంత్రుల ‘2+2 భేటీ’ జరిగింది. ఇరు దేశాల మధ్య ఈ తరహా చర్చలు జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు కేవలం అమెరికాతోనే భారత్‌ ఇటువంటి ‘2+2’ చర్చలు జరిపింది. ఇక వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఈ సాయంత్రం 5.30గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భేటీ అవుతారు. ఇందులో భాగంగా ఇరువురు నేతలు ఏకాంతంగా చర్చలు జరుపనున్నారు. ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. చర్చలు ముగిసిన తర్వాత పుతిన్‌కు ప్రధాని మోదీ విందు ఇవ్వనున్నారు. అనంతరం రాత్రి 9.30గంటలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తిరుగు ప్రయాణమవుతారు.

ఇదిలాఉంటే, భారత్‌-రష్యా మధ్య ఇప్పటికే 20సార్లు వార్షిక సదస్సులు జరగగా.. ఇది 21వ సమావేశం. సాధారణంగా ఈ వార్షిక సదస్సు ఒకసారి రష్యాలో జరిగితే మరో ఏడాది భారత్‌లో జరుగుతుంది. అయితే, గతేడాది ఈ సదస్సు భారత్‌లో జరగాల్సి ఉండగా.. కొవిడ్‌ కారణంగా వాయిదా పడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని