Rajnath Singh: దురాక్రమణకు యత్నిస్తే చావుదెబ్బ తప్పదు: రాజ్‌నాథ్‌ సింగ్‌

తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదంపై ప్రతిష్టంభన, జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర చొరబాట్లకు యత్నాలు సాగుతున్న వేళ.. చైనా, పాకిస్థాన్‌లకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.....

Published : 21 Nov 2021 01:29 IST

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదంపై ప్రతిష్టంభన, జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర చొరబాట్లకు యత్నాలు సాగుతున్న వేళ.. చైనా, పాకిస్థాన్‌లకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారత్‌లో అలజడులు సృష్టించేందుకు యత్నించినా, భూ భాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించినా తగిన జవాబు చెబుతామని స్పష్టంచేశారు. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌ జిల్లాలో అమరులైన 232 మంది జవాన్ల సంస్మరణార్థం చేపట్టిన ‘షహీద్‌ సమ్మాన్‌’ యాత్రలో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. సైనికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్న రాజ్‌నాథ్‌.. తాము అధికారంలోకి రాగానే ఒకే ర్యాంకు-ఒకే పింఛను పథకాన్ని అమలు చేసినట్లు గుర్తు చేశారు. భారత్‌ ఏ దేశాన్ని ఆక్రమించుకోదని.. అయితే తమ జోలికొస్తే బుద్ధిచెబుతామని స్పష్టంచేశారు.

‘పొరుగు దేశాలతో మంచి సంబంధాలు ఉండాలని భారత్‌ కచ్చితంగా కోరుకుంటుంది. భారీ ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా భారత్‌ను బలహీనపరిచేందుకు, అస్థిరపరిచేందుకు పాకిస్థాన్​ ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ పాక్‌కు అది సాధ్యం కాదు. భారత్‌ ఎప్పుడూ ఏ దేశాన్ని ఆక్రమించుకోలేదు. కానీ ప్రపంచంలో ఏ దేశమైనా భారత్‌కు చెందిన ఒక్క అంగుళం భూమినైనా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే.. భారత్‌ గట్టి జవాబు ఇస్తుంది. వారికి చావుదెబ్బ తప్పదు’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

జవాన్ల శౌర్యానికి ఇది నిదర్శనం

రేజంగ్​ లా కుమావోన్ బెటాలియన్​ వీర శౌర్యాన్ని రక్షణ శాఖ మంత్రి ప్రశంసలతో ముంచెత్తారు. ఈ బెటాలియన్​లో 124 మంది జవాన్లు అమరులు కాగా.. వారు 1200 మంది చైనా సైనికులను మట్టుబెట్టినట్లు వెల్లడించారు. భారత జవాన్ల శౌర్యానికిది నిదర్శనమని కొనియాడారు. ఉత్తరాఖండ్​లో ప్రస్తుతం నాలుగు ధామ్​లు (చార్ ధామ్) ఉన్నాయని, సైన్య ధామ్ పేరుతో అయిదో ధామ్​ను నిర్మించనున్నట్లు రాజ్​నాథ్​ తెలిపారు. దీని కోసం అమరులైన ఉత్తరాఖండ్ సైనికుల ఇళ్ల నుంచి మట్టిని తెప్పించనున్నట్లు వివరించారు. వారి పేర్లను ధామ్​పై లిఖించినున్నట్లు పేర్కొన్నారు. జవాన్ల త్యాగానికి గుర్తుగా ఈ స్మారకం ఎప్పటికీ ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని