India's mRNA Vaccine: దేశీయ తొలి ఎంఆర్‌ఎన్‌ఏ టీకా సురక్షితమే..!

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌లను రూపొందించడంలో ప్రపంచ దేశాలకు దీటుగా నిలిచిన భారత్‌.. తాజాగా మరో పురోగతి సాధించింది. తొలిసారిగా ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతో దేశీయంగా రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌పై జరిపిన ప్రయోగాల్లో ఇది సురక్షితమని తేలింది.

Published : 24 Aug 2021 20:41 IST

రెండు, మూడో దశల ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌లను రూపొందించడంలో ప్రపంచ దేశాలకు దీటుగా నిలిచిన భారత్‌.. తాజాగా మరో పురోగతి సాధించింది. తొలిసారిగా ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతో దేశీయంగా రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌పై జరిపిన ప్రయోగాల్లో ఇది సురక్షితమని తేలింది. దీంతో రెండు, మూడో దశల ప్రయోగాలను కొనసాగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పటికే మరో దేశీయ సంస్థ జైడస్‌ క్యాడిలాకు చెందిన తొలి డీఎన్‌ఏ టీకా జైకోవ్‌-డీ వినియోగానికి కేంద్రం అత్యవసర అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే.

కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు పుణెకు చెందిన జెన్నోవా బయోఫార్మా కంపెనీ ‘HGC019’ ఎంఆర్‌ఎన్‌ఏ (mRNA) ఆధారిత టీకాను రూపొందించింది. వీటిపై తొలిదశ ప్రయోగాలు పూర్తి చేసిన జెన్నోవా.. తాజాగా వీటి మధ్యంతర ప్రయోగ ఫలితాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDCSO)కు అందించింది. ఆ సమాచారాన్ని సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ (SEC) విశ్లేషించింది. రోగనిరోధకతను ఇవ్వడంతో పాటు టీకా సురక్షితమైనదేనని నిపుణుల కమిటీ నిర్ధారించినట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ ప్రకటించింది.

దేశీయంగా తొలిసారి ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో రూపొందించిన వ్యాక్సిన్‌ సురక్షితమని తేలడం గర్వించదగ్గ విషయమని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ కార్యదర్శి డాక్టర్‌ రేణు స్వరూప్‌ వెల్లడించారు. ఇది భారత్‌తో పాటు యావత్‌ ప్రపంచానికే ఎంతో ముఖ్యమైనదన్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారికి వ్యతిరేకంగా రూపొందుతోన్న వ్యాక్సిన్‌ల అభివృద్ధిలో కీలక మైలురాయి అని డాక్టర్‌ రేణు స్వరూప్‌ అభిప్రాయపడ్డారు. తొలిదశ ప్రయోగాల్లో ఈ వ్యాక్సిన్‌ సురక్షితమని తేలినందున.. రెండు, మూడో దశల క్లినికల్ ట్రయల్స్‌పై దృష్టి సారిస్తామని జెన్నోవా బయోఫార్మా సీఈఓ డాక్టర్‌ సంజయ్‌ సింగ్‌ వెల్లడించారు. కొవిడ్‌ సురక్ష మిషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (DBT), బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టాన్స్‌ కౌన్సిల్‌ (BIRAC) భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

ఇదిలాఉంటే, ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్‌లలో ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికతతో రూపొందిన టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. అమెరికాకు చెందిన ఫైజర్‌-బయోఎన్‌టెక్‌తో పాటు మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్‌లు ఎంఆర్‌ఎన్‌ఏ విధానంలోనే అభివృద్ధి చేశారు. ప్రయోగాలతో పాటు వాస్తవ ఫలితాల్లోనూ కొవిడ్‌-19 ను ఎదుర్కోవడంలో ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు 90శాతానికి పైగా సమర్థత చూపించినట్లు తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని