Ladakh: పెరుగుతున్న ఉద్రిక్తతలు.. చైనా సరిహద్దుల్లో యుద్ధ విన్యాసాలు

తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌, చైనా మధ్య ఘర్షణలు జరిగి ఏడాది దాటింది. గల్వాన్‌ లోయలో ఘర్షణలతో ఉద్రిక్తత తలెత్తగా వాటిని చల్లార్చేందుకు కొంతకాలంగా ఇరు దేశాల సైనికాధికారుల మధ్య 12 విడుతలుగా....

Published : 10 Aug 2021 01:48 IST

సైనిక సన్నద్ధతను ముమ్మరం చేసిన భారత్‌

తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ తన సైనిక సన్నద్ధతను ముమ్మరం చేసింది. డ్రాగన్ నుంచి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా లేహ్ పర్వత ప్రాంతాలలో యుద్ధ విన్యాసాలు నిర్వహించింది.

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌, చైనా మధ్య ఘర్షణలు జరిగి ఏడాది దాటింది. గల్వాన్‌ లోయలో ఘర్షణలతో ఉద్రిక్తత తలెత్తగా వాటిని చల్లార్చేందుకు కొంతకాలంగా ఇరు దేశాల సైనికాధికారుల మధ్య 12 విడుతలుగా చర్చలు జరిగాయి. ఫలితంగా ప్యాంగ్యాంగ్‌ సరస్సు, గోగ్రా హైట్స్‌ వంటి ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ జరిగింది. అయితే మంకుపట్టు ప్రదర్శిస్తున్న చైనా.. మిగతా ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ దిశగా అడుగులు వేయడం లేదు. ఈ పరిస్థితుల నడుమ వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీ సంఖ్యలో బలగాలను కొనసాగిస్తున్నాయి.

చైనా దుందుడుకు చర్యల కారణంగా భారత సైన్యం సైతం తమ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునే ప్రక్రియను చేపడుతోంది. డ్రాగన్‌ వైపు నుంచి వచ్చే ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టేలా.. యుద్ధ ట్యాంకులు, ఐసీవీల ద్వారా పర్వత ప్రాంతాల్లో ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా 14వేల నుంచి 17వేల అడుగుల ఎత్తులో యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లలో విన్యాసాలు నిర్వహించింది. గల్వాన్‌ వివాదం అనంతరం భారత సైన్యం టీ-90 భీష్మ, టీ-72 అజయ్‌ ట్యాంకులతోపాటు.. బీఎంపీ సిరీస్‌ పదాదిదళ పోరాట వాహనాలను ఎడారులు, మైదానాల నుంచి పర్వత ప్రాంతాలకు తరలించింది.

ఈ వాహనాలను తరలించి ఇప్పటికే ఏడాది కాగా.. మైనస్‌ 45 డిగ్రీల అతి శీతల ఉష్ణోగ్రతలో పర్వత ప్రాంతాల వద్ద వాటిని మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు సైన్యం యుద్ధ విన్యాసాలు నిర్వహించింది. అపాచీ, చినూక్‌, సీ-130, సూపర్‌ హెర్కులెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ హెలికాప్టర్లు, ఎంఐ-17 హెలికాప్టర్లు, లైట్‌ మెషీన్‌ గన్‌లతోపాటు మరికొన్ని ఆయుధాలతో సైనికులు యుద్ధ విన్యాసాల్లో పాల్గొన్నారు. రష్యాకు చెందిన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను సైతం విన్యాసాల్లో వినియోగించారు. రెజిమెంట్‌ దళాలు చేపట్టిన యుద్ధ విన్యాసాలు, అటాకింగ్‌ ఆపరేషన్లు చైనా సరిహద్దుకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకొంది.

యుద్ధ ట్యాంకుల కోసమని గతేడాది భారతీయ సైన్యం ఈ ప్రాంతంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. ట్యాంకు షెల్టర్లను సైతం నెలకొల్పింది. ఫింగర్‌ ప్రాంతం, గల్వాన్‌ లోయలో బలగాలను పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే నియామకాలు ప్రారంభించిన సైన్యం ఆయుధ సంపత్తిని సైతం సమకూర్చుకుంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు