R-Value: అదుపులోనే కొవిడ్‌ విస్తృతి.. ఊరట కలిగిస్తోన్న ఆర్‌-విలువ!

వైరస్‌ విస్తృతిని తెలియజేసే ఆర్‌-విలువ (R Factor) 1 కంటే తక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Published : 19 Oct 2021 19:22 IST

కొవిడ్‌ వ్యాప్తిపై తాజా అధ్యయనం

ముంబయి: కరోనా సెకండ్‌ వేవ్‌ ధాటికి వణికిపోయిన భారత్‌కు మూడో ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది చివరి మూడు నెలలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇదే సమయంలో వైరస్‌ విస్తృతిని తెలియజేసే ఆర్‌-విలువ (R Factor) 1 కంటే తక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా సెప్టెంబర్‌ నెల నుంచీ ఈ విలువ ఇదేస్థాయిలో కొనసాగుతున్నట్లు తెలిపింది. థర్డ్‌వేవ్‌ అనివార్యమని నివేదికలు చెబుతున్న వేళ.. కొవిడ్‌ సంక్రమణ రేటును సూచించే ఆర్‌-విలువ దేశవ్యాప్తంగా 1 కంటే తక్కువగా ఉండడం కాస్త ఊరట కలిగిస్తోంది.

కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందుతోన్న వేగాన్ని ఆర్‌-ఫ్యాక్టర్‌ (Reproduction Number) ద్వారా అంచనా వేస్తారు. తద్వారా నిర్ణీత సమయంలో వైరస్‌ ఒకరి నుంచి ఎంతమందికి వ్యాప్తి చెందుతుందో తెలుసుకుంటారు. ఈ విలువ 1 కంటే తక్కువగా ఉంటే వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా ఉందని.. 1 కంటే ఎక్కువగా పెరిగితే మాత్రం ఇన్‌ఫెక్షన్‌ రేటు గణనీయంగా పెరుగుతున్నట్లు పరిగణిస్తారు. దేశంలో కొవిడ్‌-19 సంక్రమణ తీరుపై చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్ సైన్సెస్‌ (IMS) ఎప్పటికప్పుడు ఆర్‌-విలువను అంచనాలు వేస్తోంది.

నగరాల్లోనూ అదుపులోకి..

ఇందులో భాగంగా అక్టోబర్‌ 18 నాటికి దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లో ఆర్‌-విలువ 1 కంటే తక్కువగానే ఉన్నట్లు IMS గుర్తించింది. కేవలం కొన్ని నగరాల్లో మాత్రం ఈ విలువ ఒకటి కన్నా ఎక్కువగా ఉందని పేర్కొంది. కోల్‌కతాలో R-విలువ 1 కంటే ఎక్కువగా ఉందని.. దుర్గామాత ఉత్సవాల సందర్భంగా ఇది పెరిగి ఉండవచ్చని ఐఎంఎస్‌ నిపుణులు సిత్బారా సిన్హా వెల్లడించారు. బెంగళూరులోనూ సెప్టెంబర్‌ రెండో వారం నుంచి ఆర్‌ విలువ ఎక్కువగానే ఉన్నట్లు తెలిపారు. ఇక చెన్నై, పుణె, ముంబయి నగరాల్లో ఈ విలువ 1 కంటే తక్కువగానే ఉన్నట్లు అంచనా వేశారు. ఇలా దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 25 - అక్టోబర్‌ 18 మధ్య కాలంలో ఆర్‌ విలువ 0.90గా ఉన్నట్లు సిత్బారా సిన్హా పేర్కొన్నారు. అంతకుముందు (ఆగస్టు 30- సెప్టెంబర్‌ 3) ఈ విలువ 1.1 ఉన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అనంతరం క్రమంగా తగ్గుతూ వస్తోందని, ప్రస్తుతం 0.9గా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు నిన్హా చెప్పారు.

ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతికి చాలా రాష్ట్రాలు వణికిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వైరస్‌ సంక్రమణ రేటును సూచించే ఆర్‌-ఫ్యాక్టర్‌ 1 కంటే అధికంగా ఉండడం ఆందోళన కలిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరస్‌ ఉద్ధృతి కాస్త తగ్గినప్పటికీ మరో మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగడం, వైరస్‌ బారినపడిన పడిన కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం వల్ల వైరస్‌ సంక్రమణ రేటు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి రేటు తక్కువగా ఉండడం ఉపశమనం కలిగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని