Elephant: వేటగాళ్ల ఉచ్చులో పిల్ల ఏనుగు.. తొండం కోల్పోయి మృతి!

ఇండోనేసియా సుమత్రా ద్వీపంలో వేటగాళ్ల ఉచ్చులో పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి ఏనుగుకు శస్త్రచికిత్స చేసి రక్షించాలని చేసిన ప్రయత్నం విఫలమయ్యింది.

Updated : 17 Nov 2021 11:59 IST

ఇండోనేసియా సుమత్రా ద్వీపంలో ఘటన

జకర్తా: ఇండోనేసియా సుమత్రా ద్వీపంలో వేటగాళ్ల ఉచ్చులో పడి తీవ్రంగా గాయపడిన చిన్నారి ఏనుగుకు శస్త్రచికిత్స చేసి రక్షించాలని చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. ముఖ్యంగా తొండానికి తీవ్రంగా గాయపడడంతో ఆ ఏనుగు శ్వాసకు ఇబ్బంది అయ్యింది. దీంతో సంరక్షణ కేంద్రానికి తరలించి శస్త్రచికిత్సచేసిన వైద్యులు సగం తొండం తొలగించినప్పటికీ.. తీవ్రంగా నీరసించిపోయిన పిల్ల ఏనుగు చివరకు ప్రాణాలు కోల్పోయింది.

సుమత్రా ద్వీపంలో అంతరించిపోతున్న ఏనుగులపై ఇప్పటికే అక్కడి వన్యప్రాణుల సంరక్షణ కార్యకర్తలు అందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ఒక ఏడాది వయసున్న ఏనుగును తొండం కుళ్లిపోయిన స్థితిలో ఉన్న విషయాన్ని అటవీ అధికారులు గుర్తించారు. తీవ్ర గాయాలతో నీరసంగా ఉన్న ఆ ఏనుగును వెంటనే సంరక్షణ కేంద్రానికి తరలించారు. వేటగాళ్ల ఉచ్చులో పడడం వల్లే తొండం కుళ్లిపోయినట్లు నిర్ధారించిన అధికారులు.. ఏనుగుకు శస్త్రచికిత్స చేసి సగం తొండాన్ని తొలగించారు. అయినప్పటికీ తీవ్ర అనారోగ్యానికి గురైన పిల్ల ఏనుగు.. మరుసటి రోజు ఉదయం చూసేసరికి ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి వన్యప్రాణుల సంరక్షణ అధికారులు వెల్లడించారు.

శస్త్రచికిత్స చేసి తొండం తొలగించిన తర్వాత ఏనుగు పూర్తి ఆరోగ్యంగానే కనిపించిందని.. అయినప్పటికీ మరణించడం ఎంతో షాక్‌కు గురిచేసిందని వెటర్నరీ వైద్యులు రికా మార్వాతీ విచారం వ్యక్తం చేశారు. తీవ్ర ఒత్తిడి, ఇన్‌ఫెక్షన్‌ కారణంగానే  ఏనుగు మరణించినట్లు భావిస్తున్నామని.. పోస్టుమార్టంలో మరణానికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, ఇండోనేసియా సుమత్రా ద్వీపంలో గతకొంతకాలంగా వేటగాళ్ల చేతికి పదుల సంఖ్యలో ఏనుగులు బలైనట్లు అక్కడి నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత జులై నెలలో తల తెగిపోయిన ఓ ఏనుగు మృతదేహాన్ని చూసినదాన్ని బట్టి వేటగాళ్లు ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారో తెలుస్తోందని అటవీ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014 లెక్కల ప్రకారం సుమత్రా ద్వీపంలో దాదాపు 1300 ఏనుగులు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 693కి తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని