Swachh Survekshan Awards: అత్యంత పరిశుభ్ర రాష్ట్రం, నగరం ఏవో తెలుసా..?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం వరుసగా ఐదోసారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. సూరత్‌(గుజరాత్‌), విజయవాడ(ఏపీ) తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.

Published : 20 Nov 2021 23:25 IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2021 అవార్డులను అందజేసిన రాష్ట్రపతి

దిల్లీ: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం వరుసగా ఐదోసారి అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. సూరత్‌(గుజరాత్‌), విజయవాడ(ఏపీ) తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. ఈ మేరకు శనివారం విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2021’ అవార్డులను అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ క్లీన్లీనెస్ సర్వే నిర్వహించి, ఈ జాబితాను సిద్ధంగా చేస్తుంది. ఇప్పటివరకు ఆరుసార్లు అవార్డుల ప్రదానోత్సవం జరగ్గా, ఐదుసార్లు ఇండోర్ నగరమే మొదటి స్థానంలో నిలవడం విశేషం.  

గత ఏడాది మాదిరిగానే సూరత్‌ రెండో స్థానాన్ని పదిలం చేసుకోగా, నవీ ముంబయిని వెనక్కి నెట్టి, విజయవాడ మూడో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే ఛత్తీస్‌గఢ్ అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా నిలిచింది. అలాగే అత్యంత పరిశుభ్రమైన గంగా పరివాహక పట్టణంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి చోటు సంపాదించుకుంది. ఇండోర్‌ వరుసగా మొదటిస్థానంలో నిలవడంపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అక్కడి ప్రజలు, నాయకత్వానికి అభినందనలు తెలియజేశారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్ కూడా  ఇండోర్‌ వాసులకు అభినందనలుత తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షణ్- 2021 జాబితాలో మొదటి 10 నగరాలివే: ఇండోర్, సూరత్, విజయవాడ, నవీ ముంబై, పుణె, రాయ్‌పూర్, భోపాల్, వడోదర, విశాఖపట్నం, అహ్మదాబాద్. ఈ సర్వేలో దాదాపు 4,320 నగరాలు, పట్టణాలు పాల్గొన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని