Published : 15 Oct 2021 01:52 IST

Covid Origins: కొవిడ్‌ మూలాల శోధన.. ఇదే చివరి అవకాశం!

అభిప్రాయపడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

జెనీవా: కరోనా వైరస్‌ మహమ్మారి వెలుగు చూసి రెండు సంవత్సరాలు సమీపిస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన మూలాలను కనుక్కోవడంలో యావత్‌ ప్రపంచం వెనుకబడింది. ఇప్పటికే ఓసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని దర్యాప్తు బృందం పరిశోధన చేపట్టినప్పటికీ ఫలితాన్ని ఎటూ తేచ్చలేకపోయింది. తాజాగా మరోసారి దర్యాప్తునకు ఉపక్రమించిన డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం.. మూలాలను శోధించడంలో ఇదే చివరి అవకాశం కావచ్చని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కరోనా వెలుగు చూసిన తొలినాళ్లలో నమోదైన కేసుల సమాచారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు విజ్ఞప్తి చేసింది.

కొవిడ్‌ వెలుగు చూసిన తొలినాళ్లనాటి కేసుల వివరాలకు సంబంధించిన సమాచారం పెద్ద చిక్కుముడిగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తును మరోసారి కొనసాగించేందుకు కొవిడ్‌ మూలాలపై ఏర్పాటు చేసిన శాస్త్రీయ సలహా బృందం (SAGO)లో మొత్తం 26మంది ఉండనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే వీటిపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.

డజనుకు పైగా అధ్యయనాలు అవసరం..

కొవిడ్‌ మూలాలను శోధించేందుకు డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలో అంతర్జాతీయ బృందాలు చైనాలో పర్యటించాల్సి వస్తుందని.. అందుకు చైనా సహకారం అవసరమవుతుందని కొవిడ్‌-19పై డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక విభాగాధిపతి మారియా వ్యాన్‌ కెర్ఖోవ్‌ తెలిపారు. జంతువుల నుంచి మానవులకు వైరస్‌ ఎలా వ్యాపించిందో తెలుసుకోవడానికి డజన్ల కొద్దీ అధ్యయనాలు చేపట్టాల్సి ఉందని తాజాగా జరిగిన ఓ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కొవిడ్‌ మూలాలను అర్థం చేసుకునేందుకు కేవలం 2019లో వుహాన్‌లో ఉన్నవారి యాంటీబాడీలను పరీక్షించడం ఎంతో కష్టమైన పని అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, డిసెంబరు 2019 నాటికంటే ముందు తీసుకున్న రక్త నమూనాలు, అనుమానిత కేసుల వివరాలను విశ్లేషించడంతో పాటు అక్కడి ఆస్పత్రులను పరిశీలించడం, అక్కడ చోటుచేసుకున్న మరణాల వివరాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. వీటితో పాటు వుహాన్‌ నగరంలో మెడికల్‌ ల్యాబ్‌లపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని వ్యాన్‌ కెర్ఖోవ్‌ పేర్కొన్నారు.

ఇదే చివరి అవకాశం కావచ్చు..

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి తొలిసారిగా డిసెంబర్‌ 2019లో చైనాలోని వుహాన్‌లో బయటపడిన విషయం తెలిసిందే. వాటి మూలాలను శోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని నిపుణుల బృందం చైనా నిపుణులతో కలిసి దర్యాప్తు చేపట్టింది. చివరకు కొన్ని రకాల జంతువుల ద్వారా గబ్బిలాల నుంచి మానవులకు సంక్రమించే అవకాశం ఉండవచ్చని పేర్కొంది. వీటిని తెలుసుకునేందుకు మరింత పరిశోధన అవసరమని పేర్కొంది. ఈ నేపథ్యంలో నూతన బృందంతో ఈసారి చేపట్టే విచారణే కొవిడ్‌ మూలాలను కనిపెట్టేందుకు ఇదే ఉత్తమమైనది, ఇదే చివరి అవకాశం కావచ్చని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర సేవల నిపుణుడు మైక్‌ రేయాన్‌ స్పష్టం చేశారు.

అయితే, ఇదివరకు దర్యాప్తులో భాగంగా నాలుగు వారాలపాలు డబ్ల్యూహెచ్‌ఓ బృందం చైనాలో పర్యటించినప్పటికీ నిపుణులకు సరైన సమాచారం అందించలేదనే విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో కొవిడ్‌-19కు కారణమైన వైరస్‌ వుహాన్ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయ్యిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే వీటిని చైనా మాత్రం తోసిపుచ్చుతోంది. అంతేకాకుండా కొవిడ్‌ మూలాలపై చైనాలో మరోసారి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదనీ వాదిస్తోంది. ఒకవేళ అలా చేయాల్సి వస్తే.. చైనాలో కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ మూలాల శోధన చేపట్టాలని ఐక్యరాజ్య సమితిలోని చైనా రాయబారి చెన్‌ షూ మరోసారి పేర్కొన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts